![]() |
![]() |

పాపం... కొరటాల శివ! ఏ ముహూర్తాన ‘ఆచార్య’ సినిమా స్టార్ట్ చేశారో గానీ... అన్నీ ఎదురు దెబ్బలే! అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు. ఏదో ఒక అడ్డు తగులుతోంది. దాంతో రెండేళ్లుగా ఈ సినిమా మీద కొరటాల కూర్చోవలసి వచ్చింది. సినిమా పనులు ఓ అడుగు ముందుకు పడితే... రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇది పూర్తి చేస్తే గానీ మరో సినిమా స్టార్ట్ చేయడానికి లేదు. త్వరగా ‘ఆచార్య’ పూర్తి చేయాలన్న సంకల్పం నెరవేరడం లేదు.
‘ఆచార్య’ చేయాలని చిరంజీవిని కొరటాల శివ కలవలేదు. రామ్‌చరణ్‌తో కొన్నేళ్ల క్రితం సినిమా చేయాలని కొరటాల అనుకున్నారు. బండ్ల గణేష్ నిర్మాతగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కానీ, కథ మీద కొరటాలకు పూర్తి సంతృప్తి లేక సినిమాను పక్కనపెట్టేశారు. తర్వాత మళ్ళీ చరణ్‌తో సినిమా అనుకున్నప్పుడు... ‘ఆర్‌ఆర్‌ఆర్’తో చరణ్ బిజీగా ఉండటంతో చిరంజీవితో సినిమా చేయమని అడిగారట. చిరు, కొరటాల కాంబినేషన్ సెట్ చేసింది చరణే అని ఇండస్ట్రీ టాక్. అలా సినిమా ప్రారంభమైంది.
కథ కుదిరింది. కాంబినేషన్ కురిదింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. కానీ, అనుకున్నట్టుగా చిత్రీకరణ మాత్రం జరగడం లేదు. మొదట సినిమా నుండి హీరోయిన్ తప్పుకుంది. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సినిమా చేయనని త్రిష హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. దాంతో చిత్రీకరణకు విరామం ఇవ్వక తప్పలేదు. త్రిష బదులు కాజల్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. అన్‌లాక్‌లో చిత్రీకరణ పునఃప్రారంభించాలని అనుకున్నప్పుడు కాజల్ పెళ్లి చేసుకున్నది. ఆమె లేని సన్నివేశాలు ముందు తీసి... తర్వాత చిరు, కాజల్ కాంబినేషన్‌లో సీన్స్ తీయాలనుకుని అంతా సిద్ధం చేసుకున్నాక... మెగాస్టార్‌కి కరోనా అని తెలిసింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతోంది.
వీటితో పాటు మరో ముఖ్య సమస్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఒకటి. ముందు ఆ పాత్రకు సూపర్‌స్టార్ మహేష్‌బాబును సంప్రదించినట్టు... ఆయన ఎక్కువ రెమ్యూనరేషన్ కోట్ చేయడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు వార్తలొచ్చాయి. అసలు మహేష్‌ను సంప్రదించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
‘ఆచార్య’లో తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్నాడని అధికారికంగా చిరంజీవే ప్రకటించారు. అయితే... ‘ఆర్‌ఆర్‌ఆర్’ షెడ్యూల్, ‘ఆచార్య’ షెడ్యూల్ క్లాష్ అయ్యింది. దాంతో రాజమౌళికి చిరంజీవి స్వయంగా ఫోన్ చేయడంతో ఆయన షెడ్యూల్స్ క్లాష్ కాకుండా చూసుకున్నారు. చిరంజీవికి కరోనా రావడంతో ఇప్పుడు ఆ సినిమా షెడ్యూల్‌లోనూ కొన్ని మార్పులు చేసుకోవలసి వస్తోందని టాక్. అడ్డంకులు దాటుకుని ‘ఆచార్య’ ఎప్పటికి పూర్తి అవుతుందో? వెయిట్ అండ్ సీ!
![]() |
![]() |