![]() |
![]() |

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి రూపొందిస్తోన్న 'చెక్' మూవీ ట్రైలర్ వచ్చేసింది. "యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకూ ఏదీ కర్మను తప్పించుకోలేదు." అంటూ మురళీశర్మ వాయిస్ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండగా ట్రైలర్ మొదలైంది. ఈ సినిమా కథ తయారయ్యింది ఆ లైన్ మీదే అని డైరెక్టర్ చెప్పేశాడు. చెస్ ప్లేయర్ అయిన ఆదిత్య (నితిన్) దేశద్రోహిగా ముద్రపడి జైలుఖైదీగా మారాడనీ, అతడిని ఆ కేసు నుంచి బయటపడెయ్యడానికి, అతడి తరపున వాదించడానికి ఓ లేడీ లాయర్ (రకుల్ ప్రీత్) వచ్చిందనీ ట్రైలర్ తెలియజేస్తోంది. ఓ టెర్రరిస్ట్‌గా, దేశద్రోహిగా ఆదిత్యకు ఎందుకు ముద్రపడిందనేదే ఈ సినిమాలోని కీలకాంశం.
జైలుకు రాకముందు అతడికో ప్రేమకథ ఉందని తెలుస్తోంది. "నా పేరు చేసే శబ్దం.. యాత్"ర అంటూ ఆ ప్రియురాలు (ప్రియా ప్రకాశ్ వారియర్) ఆదిత్యతో చెప్పింది. ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా సాగుతున్న వారి ప్రేమకథకు ఏదో అనూహ్యమైన ఘటనతో చెక్ పడిందనీ, ఆదిత్య జైలుపాలవడానికి ఆ ఘటనే కారణమవుతుందనీ ఊహించవచ్చు.
ఆదిత్య జైలుకు వచ్చాక అక్కడ ఒంటరిగా చెస్ ఆడుకుంటున్న ఓ వృద్ధ ఖైదీ (సాయిచంద్) కనిపించాడు. "ఏం చేసినా అపోనెంట్ ఉంటేనేగా కిక్కు. నేనూ ఆడొచ్చా?".. అని ఆయనను అడిగాడు ఆదిత్య. ఆ వృద్ధుడు ఆటకు ఆహ్వానించాడు. ఆదిత్య వేసిన ఓ ఎత్తు చూసి షాకయ్యాడు. ఆ వయసుమళ్లిన ఆటగాడు ఆదిత్యకు అందులోని పావుల గురించి వివరిస్తూ వచ్చాడు. "ఇది ఏనుగు. దీని దారి రహదారి. దీనికి ఎదురెళ్లాలంటే దమ్ము కావాలి." అని చెప్పాడు. "ఇది ఒంటె. దీనిమీదెప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి." అని సూచించాడు. "నువ్వు ఇక్కడేం చేసినా కొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి." అని ఆదిత్యను హెచ్చరించాడు.
ఆ జైలులో ఆదిత్యను అంతం చేయడానికి తోటి ఖైదీలు ప్రయత్నించడమో లేదా ఆ ఖైదీలు అతడితో గొడవ పెట్టుకోవడమో చేశారు. దాంతో వాళ్లతో తలపడ్డాడు ఆదిత్య. వాళ్ల ఆగడాలకు చెక్ చెప్పాడు.
"వీళ్లకి ఏ సమస్య వచ్చినా కానీ కుంగిపోరు. సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు." అని సీనియర్ లాయర్ అయిన పోసాని కృష్ణమురళి వాయిస్ వినిపించింది. అది ఆదిత్య, వృద్ధ ఖైదీల గురించే అనిపిస్తుంది.
ఆదిత్య తరపున కోర్టులో వాదించడానికి లేడీ లాయర్ వచ్చింది. జైలులో ఆదిత్యను కలుసుకుంది. ఆమెకు అతను తన కథ చెప్పాడనీ, దాన్ని ఆమె నమ్మలేదనీ అనిపిస్తుంది. దాంతో, "నువ్వు నమ్మితే నిర్దోషినని ప్రూవ్ అవుతాను కాబట్టి." ఈ కథ చెప్పినట్లు ఆదిత్య అన్నాడు. అయితే ఆ కేసు గెలవలేననుకుందో, గేమ్‌లో భాగంగానో "ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను." అంటూ కోర్టులో జడ్జి ఎదుట చెప్పింది లాయర్.

ఆదిత్యకు జైల్లో ఉండగానే చెస్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం వచ్చింది. కానీ జైలు అధికారి (సంపత్ రాజ్) అంగీకరించలేదు. "హి ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. అతన్నాపకండి." అని ప్రాధేయపడింది లాయర్. "వాడ్ని కలిసి కలిసీ నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా?" అనడిగాడు జైలర్. ఆమెను అతను ఏకవచనంతో సంబోధించడం చూస్తే, ఆ ఇద్దరికీ బంధుత్వమేదో ఉన్నదని అనిపిస్తోంది.
మొత్తానికి ఆదిత్యకు చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం జైలు అధికారులు కల్పించారు. ఖైదీగానే చెస్ ఆడటానికి వచ్చిన ఆదిత్యను చూసి, ఓ చెస్ ప్లేయర్ (చైతన్యకృష్ణ) "ఓ టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా?" అని టోర్నమెంట్ నిర్వాహకుల్ని ప్రశ్నించాడు. ఆ వెంటనే వచ్చే సీన్‌లో ఆదిత్య చొక్కాను పట్టుకొని గట్టిగా కుదిపేస్తూ, "దేశద్రోహీ!" అన్నాడు ఆగ్రహంగా జైలర్. ఈ రెండు షాట్లతో ఆదిత్య మీద చాలా పెద్ద నేరం మోపబడిందని అర్థమవుతోంది.
"ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా?" అని తన ఇంట్లో ఎవరినో అడిగింది లాయర్.
"రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి.". అని విలన్ వాయిస్ వినిపించగా, "యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి." అని గట్టిగా సమాధానమిచ్చాడు ఆదిత్య. అతను ఎవరికి చెక్ చెప్పాడనేది ఆసక్తికరం.
"అహం నియతిం నిశ్చామి".. అని ట్రైలర్ మొదట్లో మాటలు వినిపించాయి. అంటే "నా నుదిటిరాతను నేను నియంత్రిస్తాను" అని చెప్పడం. తన నుదిటిరాతను ఆదిత్య నియంత్రించుకున్నాడని దర్శకుడు చెబుతున్నాడు. ఎలా అనేది తెలుసుకోవాలంటే 'చెక్' చూడాల్సిందే.
హర్షవర్ధన్, రోహిత్ పాఠక్, వీరేంద్ర చౌహాన్, ప్రవీణ్ లాంటి వాళ్లు కూడా నటించిన ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనందప్రసాద్ నిర్మించారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, కల్యాణీ మాలిక్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో చెక్ ట్రైలర్ ఉద్విగ్నభరితంగా కనిపిస్తోంది.
నటుడిగా నితిన్‌లోని మరో యాంగిల్‌ని చెక్ మూవీ మన ముందు పెట్టబోతోందనేది స్పష్టం. ఆదిత్య పాత్రతో నటుడిగా అతను మరో మెట్టు ఎక్కనున్నాడు. డైరెక్టర్‌గా చంద్రశేఖర్ ఏలేటి ఎంతటి ప్రతిభావంతుడో ఆయన ఇప్పటిదాకా రూపొందించిన సినిమాలే నిదర్శనం. చెక్‌తో ఆయన మరింత పేరు సంపాదించుకుంటాడనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది. ఫిబ్రవరి 26న రిలీజవుతున్న సినిమాతో ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానాలు లభించనున్నాయి.
![]() |
![]() |