![]() |
![]() |

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో లాక్ డౌన్ ముందు సినిమాలు, సరదాలు, పెళ్లిళ్లు చిన్నవేనని హీరో నితిన్ అన్నారు. ఇప్పుడు ప్రజల ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన చెప్పారు. కరోనా లేకపోతే ఆదివారం నితిన్‌ని ప్రజలందరూ పెళ్లి కొడుకుగా చూసేవారు. నాలుగు రోజుల తర్వాత షాలినితో దుబాయ్‌లో ఏడడుగులు వేసేవారు. నితిన్ కలలకు కరోనా అడ్డుకట్ట వేసింది. పుట్టినరోజు, పెళ్లి వేడుకలను ఆయన వాయిదా వేసుకున్నారు. తాజాగా ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా, పెళ్లి వాయిదా వేయడం గురించి నితిన్ మాట్లాడారు.
"ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ఈ ప్రపంచంలో సినిమాలు, పెళ్లి అనేవి చిన్నవే. డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. సినిమాలు పోతే మళ్లీ హిట్ సినిమాలు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలంటే మనం బావుండాలి. మనం బావుంటే అన్నీ బావుంటాయి. ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా! అందుకని, మనస్ఫూర్తిగా నా పెళ్లిని వాయిదా వేశా" అని నితిన్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు కాబోయే శ్రీమతి షాలిని కుటుంబ సభ్యులు కూడా పెళ్లి వాయిదా వేయడనికి సంతోషంగా అంగీకరించారని నితిన్ అన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మొట్టమొదట విరాళం ఇచ్చిన హీరో నితినే. ఈ విషయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అతడిని పలువురు అభినందించారు. పెద్దలు ప్రశంసించడం సంతోషమే అయినప్పటికీ... ఇతరులు మెచ్చుకోవాలని తాను విరాళం ఇవ్వలేదని, ఇవాళ తాను హీరోగా ఈస్థాయిలో ఉండడానికి కారణమైన ప్రజలు కష్టాల్లో ఉండడంతో వాళ్లకు ఏదైనా చేయాలని విరాళం ఇచ్చినట్టు నితిన్ చెప్పాడు.
![]() |
![]() |