![]() |
![]() |

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత వాళ్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమంటే.. ఇందులో విలన్‌గా భూమికా చావ్లా నటించనున్నదని! అవును. ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ను చేసేందుకు భూమిక ఆసక్తిగా ఉన్నదని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో లేడీ విలన్ కోసం బోయపాటి మొదట రోజా అయితే బావుంటుందని అనుకున్నాడు. ఆ మేరకు సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాలో తాను నటించనున్నట్లు వచ్చిన ప్రచారాన్ని రోజా తోసిపుచ్చారు.
ఇప్పుడు 'ఖుషి', 'ఒక్కడు' సినిమాల హీరోయిన్ భూమిక పేరు గట్టిగా వినిపిస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి చేసుకున్న భూమిక.. తన సహ తారలు త్రిష, నయనతార, శ్రియ వంటి వాళ్లు ఇంకా హీరోయిన్లుగా చేస్తుంటే, తను మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. బాలకృష్ణ మునుపటి మూవీ 'రూలర్'లోనూ ఆమె ఒక కీలక పాత్ర చేసింది. క్లైమాక్స్‌లో ఆమెకు రక్షకుడిగా బాలయ్య కనిపించారు. ఇప్పుడు ఏకంగా బాలయ్యను ఢీకొట్టే లేడీ విలన్ క్యారెక్టర్ చాన్స్ ఆమెకు రావడం విశేషమే. అయితే ఇందులో వాస్తవం ఎంతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. నాయికగా అంజలి పేరు వినిపిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగింది. లాక్‌డౌన్ పీరియడ్ ముగిసేలోగా ఈ సినిమా విషయాలు మరిన్ని వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |