![]() |
![]() |
ఆలిండియా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని అందరి మనసుల్ని దోచుకున్న నటి శ్రీదేవి. బోనీకపూర్, శ్రీదేవిల కుమార్తె అయిన జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత హిందీలోనే పది సినిమాలకుపైగా నటించింది. అయితే శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ ఉన్న జాన్వీ టాలీవుడ్‌లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని అంతకుముందు రకరకాల వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలో హీరోయిన్‌గా ఓకే అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని శ్రీదేవి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న ‘దేవర’ గ్లింప్స్ రిలీజ్ కాబోతోంది. దీనిలో ఎన్టీఆర్, జాన్వీ కలిసి నటించిన ఒక్క షాట్ అయినా ఉండకపోతుందా అన్న ఆశతో ఉన్నారు అభిమానులు.
ఇటీవల జాన్వీకపూర్ తిరుమల వెళ్ళి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంది. తిరుమల వెళ్లిన ప్రతిసారీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ అలరిస్తోంది జాన్వి. ఈసారి పట్టుచీరతో కనిపించి అచ్చమైన తెలుగు అమ్మాయి అనిపించింది. ఒకప్పటి హీరోయిన్, జాన్వీ పిన్ని అయిన మహేశ్వరితోపాటు తిరుమలకు వెళ్లిన జాన్వీ.. దర్శనం తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చి అందరికీ కనువిందు చేసింది. తన అందచందాలతో, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న జాన్వీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తను ప్రస్తుతం తెలుగులో చేస్తున్న ‘దేవర’ చిత్రం గురించి మీడియాతో మాట్లాడిరది. ‘దేవర సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం. మొదటి రోజు సెట్‌లో అడుగుపెట్టగానే మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతికి లోనయ్యాను. ఇదే నా మొదటి సినిమానా, ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నానా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ ఓ వర్క్ షాప్‌లా అనిపించేవి. ‘దేవర’ నా తొలి సినిమా అనే ఫీలింగ్‌ని కలిగించిందంటే ఈ సినిమా నన్ను ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోండి’ అంటూ ‘దేవర’ చిత్రం గురించి తన మనసులోని మాటను చెప్పడం ఎన్టీఆర్ అభిమానుల్ని ఆనందంలో ముంచేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయిపోయిందని అభిమానులు ఎంతో హ్యాపీగా చెబుతున్నారు.
‘దేవర’ చిత్రంలో జాన్వీకపూర్‌ని హీరోయిన్‌గా నటించబోతోందనే వార్తతోనే హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాలో జాన్వీ క్యారెక్టర్ చాలా యునీక్‌గా ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ‘దేవర’ గురించి జాన్వీ చెప్పిన మాటలతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సినిమా జాన్వీకి పర్‌ఫెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు, శ్రీదేవి అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.
![]() |
![]() |