![]() |
![]() |

తారాగణం: విక్రాంత్ మాసే, యామీ గౌతమ్, మానసీ శర్మ, సుహైల్ నయ్యర్, రాజీవ్ గుప్తా, ఆయేషా రజా, మాజెల్ వ్యాస్
రచన: నవజోత్ గులాటీ, సుమిత్ అరోరా
సంగీతం: పాయల్ దేవ్, గౌరవ్ చటర్జీ, జాన్ నిస్సార్ లోన్
బ్యాగ్రౌండ్ స్కోర్: ప్రసాద్ సష్టే
సినిమాటోగ్రఫీ: నూతన్ నాగరాజ్
ఎడిటింగ్: సందీప్ సేథీ
నిర్మాత: వినోద్ బచ్చన్
దర్శకత్వం: పునీత్ ఖన్నా
విడుదల తేదీ: 9 అక్టోబర్ 2020 (నెట్‌ఫ్లిక్స్)
అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి దేశంలో ప్రబలిన పితృస్వామ్యానికీ, స్త్రీద్వేషానికీ బాధ్యత వహిస్తున్నాయనేది చాలా కాలం నుంచి ఉన్న వాదన. ప్రేమలో పడినవాళ్లను తల్లిదండ్రులు అదిరించో, బెదిరించో తాము ఎంపిక చేసినవాళ్లను పెళ్లి చేసుకొనేలా చేస్తుంటారు. పెళ్లి నిర్ణయాన్ని పిల్లల చేతుల్లోంచి వాళ్లు లాగేసుకుంటూ ఉంటారు. ఈ రకమైన తిరోగమన మనస్తత్వాన్ని బలపరిచే సినిమాగా 'గిన్నీ వెడ్స్ సన్నీ'ని చెప్పుకోవచ్చు. ఈ భావజాలాన్ని పక్కన పెట్టేసి, కేవలం ఒక సినిమాగా మాత్రమే దీన్ని చూద్దామనుకున్నా.. దర్శక నిర్మాతలు చెప్పినట్లు దీన్నొక రొమాంటిక్ కామెడీగా చూద్దామనుకున్నా.. ఆ విషయంలో మనకు తీవ్ర ఆశాభంగం తప్పదు. ఇందులో గిలిగింతలు పెట్టే రొమాన్సూ లేదు, అలరించే కామెడీ లేదు.
కథేమిటంటే.. సన్నీ (విక్రాంత్ మాసే) తమ రెస్టారెంట్ నడపడానికి ఆత్రుత పడుతుంటే, తండ్రి (రాజీవ్ గుప్తా) పెళ్లి చేసుకుంటేనే దానికి అంగీకరిస్తాననీ, లేదంటే తమ రెస్టారెంట్‌ను అతని చేతికి ఇవ్వననీ చెబుతాడు. పెళ్లిళ్ల పేరమ్మ (ఆయేషా రజా) తెచ్చిన రెండు సంబంధాలను సన్నీ తిరస్కరిస్తాడు. దాంతో ఆమె తన కూతురు గిన్నీ (యామీ గౌతమ్)ని అతడికిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
అతికొద్ది సన్నివేశాలు మాత్రమే కాస్త నవ్వు తెప్పిస్తాయి. లవ్ సీన్స్‌లో ఒకట్రెండు ఆకట్టుకుంటాయి. ఆ రకంగా చూసుకుంటే రొమాంటిక్ కామెడీ అనే జానర్‌కు ఇది న్యాయం చేయలేదనిపిస్తుంది. అయితే, సినిమాటోగ్రాఫర్ నూతన్ నాగరాజ్ విజువల్స్‌ను తక్కువ చెయ్యలేం.
హీరో హీరోయిన్ల పాత్రలు ఇటు అమాయకమైనవి కావు. అట్లా అని అల్లరి చేసే పాత్రలూ కావు. గిన్నీ తల్లి పాత్ర లాంటి విషపూరితమైన తల్లి పాత్రను ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. ఆమె చెప్పే క్షమాపణల్లోనూ నిజాయితీ కనిపించదు. లేత గులాబీ రంగు కళ్లద్దాలు గిన్నీ దృష్టిని అస్పష్టం చేసినట్లే, ఆమె పాత్ర తీరు కూడా అస్పష్టం. ఒక యువతి స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, జాబ్ చేయడం, మోడ్రన్ దుస్తులు ధరించడం వల్ల ఆమెది దృఢమైన వ్యక్తిత్వమనీ, ఆమె ఇండిపెండెంట్ ఉమన్ అనీ చూపించడం డైరెక్టర్ అపరిణిత దృష్టికి నిదర్శనం. యామీ, ఆయేషా పాత్రలను మలచిన విధానం దీన్నే వెల్లడిస్తాయి.
.jpg)
తన కాళ్లపై తాను నడవలేని సన్నీఆడవాళ్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ, తనది నిజమైన ప్రేమని తనని తానే కన్విన్స్ చేసుకోవడానికి చూస్తుంటాడు. సన్నీ క్యారెక్టర్‌లో రొమాంటిక్ హీరోగా విక్రాంత్ మాసే ఎలివేట్ కాలేకపోయాడు. గిన్నీ మాజీ ప్రియుడిగా సుహైల్ నయ్యర్ ఆమె వెంటపడుతుండటం తప్ప ఇంకేమీ చెయ్యడు. స్క్రిప్ట్ అతనికి అంతవరకే అవకాశం ఇచ్చింది. ఈ సినిమా మొత్తం వరస్ట్ యాక్టర్ ఎవరంటే విక్రాంత్ తండ్రిగా నటించిన రాజీవ్ గుప్తా. సినిమా అంతే ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టమని డైరెక్టర్ చెప్పినట్లుగా నటించాడు. అతడి డైలాగ్ డెలివరీ హారిబుల్.
ముందే చెప్పినట్లు ఈ సినిమా మనలో రొమాంటిక్ మూడ్‌ని కలిగించదు. అలాగే నవ్వులూ పండించదు. విక్రాంత్, యామీ మధ్య దాబా సీన్ డైరెక్టర్ పనితనానికి నిదర్శనం. ఆ తరహా సన్నివేశాలు ఎన్ని సినిమాల్లో మనం చూసి ఉంటామో! డైరెక్టర్ పునీత్ ఖన్నా కానీ, అతని రైటర్లు కానీ సన్నివేశాల కల్పన విషయంలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చాలా సీన్లు అనవసరం అనిపిస్తాయి. అంటే ఎడిటర్ సరిగా వర్క్ చెయ్యలేదనే అర్థం. బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇప్పటికే మన సమాజంలో తిరోగమన భావాలు పెచ్చరిల్లుతున్న ఈ కాలంలో, వాటికి మరింత ఊతమిచ్చేలా ఉన్న ఈ సినిమా ఏ విషయంలోనూ ఆకట్టుకోలేదు.
రేటింగ్: 1.25/5
![]() |
![]() |