![]() |
![]() |

అనుష్కతో రూపొందించిన 'రుద్రమదేవి' (2015) వంటి చారిత్రక చిత్రం తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ మళ్లీ ఇంతదాకా మెగాఫోన్ పట్టుకోలేదు. ఆ సినిమా విడుదలై అక్టోబర్ 9కి ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయన తన సరికొత్త చిత్రాన్ని ప్రకటించారు. అది ఇదివరకు ఆయన ప్రకటించిన 'హిరణ్యకశ్యప' కాదు. రానాను టైటిల్ రోల్‌లో చూపిస్తూ 'హిరణ్యకశ్యప' చిత్రాన్ని తియ్యాలని ఆయన సంకల్పించిన విషయం తెలిసిందే.
అయితే దానికంటే ముందుగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల ప్రేమకథను 'శాకుంతలం' పేరుతో సెల్యులాయిడ్‌పైకి తీసుకు రావాలని గుణశేఖర్ సంకల్పించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆయన ప్రకటించారు. "వెండితెరపై 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు ... భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని 'శాకుంతలం' టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
'రుద్రమదేవి' సినిమా తరహాలోనే 'శాకుంతలం' చిత్రాన్ని కూడా ఆయన సొంత నిర్మాణ సంస్థ గుణా టీమ్ వర్క్స్ పై ఆయన కుమార్తె నీలిమ గుణ నిర్మించనున్నారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. దర్శకత్వంతో పాటు రచన కూడా గుణశేఖర్ చేస్తున్నారు. శకుంతల, దుష్యంతుల పాత్రలను ఎవరు చేసేదీ ఆయన వెల్లడించలేదు. ట్విట్టర్‌లో ఆయన ఈ మూవీని ప్రకటించగానే ఆ పాత్రలను ఎవరు చేస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇదివరకు ఇదే కథతో 'శకుంతల' పేరుతో రెండు సినిమాలు తెలుగులో వచ్చాయి. 1966లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన 'శకుంతల' చిత్రంలో శకుంతల, దుష్యంతుల పాత్రలను బి. సరోజాదేవి, ఎన్టీఆర్ పోషించారు. దీనికంటే ముందు 1932లో సర్వోత్తమ్ బాదామి డైరెక్షన్‌లో వచ్చిన 'శకుంతల'లో ఆ పాత్రలను సురభి కమలాబాయి, యడవల్లి సూర్యనారాయణరావు ధరించారు. అయితే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను రంజింప చేయడంలో విఫలమవడం గమనార్హం. ఇప్పుడు గుణశేఖర్ తన రచనా పటిమతో, దర్శకత్వ ప్రతిభతో 'శాకుంతలం'ను ఎలా జన మనోరంజకంగా మలుస్తారనేది ఆసక్తికరం.
![]() |
![]() |