![]() |
![]() |

వరుణ్‌తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు కిరణ్ కొర్రపాటి. ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ బాక్సింగ్ డ్రామా మూవీ విడుదలవుతోంది. కాగా కిరణ్ నిర్మాతగా మారి త్వరలో ఓ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ మూవీలో సముద్రకని మెయిన్ లీడ్‌గా నటిస్తుండటం విశేషం. అందులో ఆయన దివ్యాంగుడిగా కనిపించనున్నారు. ఒక తండ్రి, అతని ఆరేళ్ల కొడుకు మధ్య అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.
గమనించాల్సిన విషయమేమంటే గతంలో సముద్రకని దగ్గర కిరణ్ దర్శకత్వ శాఖలో పనిచేయడం. సముద్రకని డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాలు 'శంభో శివశంభో', 'జెండాపై కపిరాజు' సినిమాలకు కిరణ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు తన గురువు హీరోగా ఆయన సినిమాని నిర్మించేందుకు సంకల్పించారు. ఈ మూవీతో శివ అనే యువకుడు దర్శకునిగా పరిచయం కాబోతున్నాడు. శివ చెప్పిన కథ సముద్రకనికి బాగా నచ్చిందనీ, ఆయనతో సినిమా చెయ్యనుండటం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందనీ 'తెలుగువన్'కు చెప్పారు కిరణ్.
తన భార్య వీణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అనౌన్స్ చేస్తామని కిరణ్ తెలిపారు.
![]() |
![]() |