![]() |
![]() |

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో 'గజదొంగ' చిత్రం ఒకటి.
యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి, సహజనటి జయసుధ కథానాయికలుగా నటించారు. రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గుమ్మడి, కాంతారావు, పండరీబాయి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. చక్రవర్తి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. యన్టీఆర్, జయమాలిని కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రత్యేక గీతం నీ ఇల్లు బంగారంగానూ ఆల్ టైమ్ హిట్ నంబర్ గా నిలిచింది. అలాగే ఇంద్రధనసు చీరకట్టి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్.
విజయదుర్గ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన 'గజదొంగ' 1981 జనవరి 30న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ సినిమా 40 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |