![]() |
![]() |

మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు నేడు. మెగా బ్రదర్స్‌లో పెద్దవాడైన చిరంజీవి ఇంట్లోనే ఆమె ఉంటున్నారు. ఆయన సినిమా ఆచార్య 'టీజర్' ఈ రోజు రిలీజ్ చేయడానికి కారణం కూడా ఆమె పుట్టినరోజు కావడం. ఇలా ఆమెకు తన సినిమా టీజర్ రూపంలో కానుకను అందించారు చిరు. ఆమె పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపడానికి మిగతా ఇద్దరు బ్రదర్స్ నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా చిరు ఇంటికి విచ్చేశారు. తల్లి చేత కేక్ కట్ చేయించి, ఆమెతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపారు. ముగ్గురు పుత్రులను ఒకే చోట చూడ్డం ఎప్పుడో కానీ ఆమెకు తటస్థించదు.
ఈరోజు అలా ఆ ముగ్గురు అన్నదమ్ములను ఒక చోట చూసి, వారితో గడిపే అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అలాగే ఇద్దరు కుమార్తెలు మాధవి, విజయదుర్గ కూడా అమ్మకు శుభాకాంక్షలు తెలిపి, ఆమెతో గడిపేందుకు వచ్చేశారు. ఎటుతిరిగీ పెద్ద కోడలు సురేఖ, రెండో కోడలు పద్మజ కూడా అక్కడే ఉన్నారు. ఒక్క పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా మాత్రమే మిస్సయింది. ఇలా తన కొడుకులు, కుమార్తెలు, కోడళ్లు తనతో ఏర్పరచుకున్న ఆత్మీయ బంధానికి ఆ తల్లి హృదయం పొంగిపోయిందని వారంతా కలిసి తీయించుకున్న ఫొటో నిదర్శనంగా నిలిచింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఆ ఫొటోలో అంజనాదేవి అందరి మధ్యలో కూర్చొని మనసారా నవ్వుతున్నారు. ఆమెకు ఓవైపు చిరంజీవి, ఇంకోవైపు నాగబాబు కూర్చున్నారు. ఆ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబు అయితే తల్లిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటో షేర్ చేసి, తన జీవితంలో ఆమె ప్రాధాన్యాన్ని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

![]() |
![]() |