![]() |
![]() |

గుణశేఖర్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన 'శాకుంతలం' చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. మహాభారతం ఆదిపర్వంలో వచ్చే శకుంతల-దుష్యంతుల ప్రణయ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ రూపొందించనున్నారు. వ్యాస మహర్షి విరచిత మహాభారతం ప్రకారం విశ్వామిత్ర మహర్షి, దేవనర్తకి మేనకల కుమార్తె శకుంతల. అడవికి వేటకు వచ్చిన దుష్యంత మహారాజు అతిలోక సౌందర్యవతి అయిన శకుంతల చూసి, తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఆయనకు మనసిస్తుంది. ఇద్దరూ గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. తర్వాత ఆమెను విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్లిపోతాడు దుష్యంతుడు. ఆమెను పూర్తిగా మర్చిపోతాడు. తిరిగి దుష్యంతుడిని శకుంతల ఎలా కలుసుకుందనేది ఆసక్తికరమైన కథ.
ఇప్పటికే శకుంతల పాత్ర చేయడానికి సమంత సంతకం చేశారు. దుష్యంతుని పాత్రధారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించనున్నారు.
కాగా 'శాకుంతలం' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన ఓ వీడియో గ్లిమ్స్‌ను గుణశేఖర్ కుమార్తె, 'శాకుంతలం' చిత్ర నిర్మాత నీలిమ గుణ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. దాంతో పాటు, "Set construction work.. can’t wait for the vision to take form! #Shaakuntalam" అని రాసుకొచ్చారు. త్వరలోనే ప్రధాన పాత్రధారుల ఎంపికను పూర్తిచేసి, షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి గుణ టీమ్ వర్క్స్ సన్నాహాలు చేస్తోంది.

![]() |
![]() |