![]() |
![]() |

నిహారిక కొణిదెల, వెంకటచైతన్య జొన్నలగడ్డ వివాహ ఘట్టం ముగిసింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో తెలుగింటి సంప్రదాయం ప్రకారం పూజారి పెళ్లి మంత్రాలు చదువుతుండగా, నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేశాడు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహ వేడుక మొదలైంది. మొదట నిహారిక చేత ఆమె తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ముత్తైదువలకు తాంబూలాలు ఇప్పించారు. ఆ తర్వాత నిహారిక పెళ్లి దుస్తుల్లోకి మారింది. గోల్డ్ కలర్ పట్టుచీర, వయొలెట్-గోల్డ్ కలర్ బ్లౌజ్, మెడ నిండుగా హారాలు, చెవులకు పొడవాటి దుద్దులు, తలకు పాపిట బిళ్లతో సంపన్న తెలుగింటి అమ్మాయిలాగా నిహారిక కళ్లు చెదిరేట్లు మెరవగా, వయొలెట్, గోల్డ్ కలర్ కుర్తా, ప్లెయిన్ వయొలెట్ పైజమా, మొడలో పులిగోరున్న పొడవాటి చైన్‌తో చైతన్య అందంగా కనిపించాడు.

మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరూ ఈ వేడుకలో పాలు పంచుకోవడం గమనార్హం. మెగా బ్రదర్స్, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా మాత్రం కనిపించలేదు. ఆమెకు బదులుగా రేణు దేశాయ్ పిల్లలు అకిర నందన్, ఆద్య ఈ వివాహానికి తండ్రితో పాటు రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చిరంజీవి తన సెల్‌ఫోన్‌తో నిహారిక వివాహ ఘట్టాన్ని వీడియో తీయడం కనిపించింది. అలాగే నిహారిక అన్న వరుణ్ తేజ్ కూడా ఆ అపురూప క్షణాల్ని తన ఫోన్‌లో బంధించాడు. పవన్ కల్యాణ్ నోటి మీద చేయిపెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. మొత్తానికి నిహారిక ఉదయ్‌పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్ సినిమా భాషలో బ్లాక్‌బస్టర్ అయ్యిందనేది నిజం.





![]() |
![]() |