![]() |
![]() |

భారతీయ చిత్రసీమలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో సంజయ్ దత్ ఒకరనే విషయంలో రెండో ఆలోచనకు ఆస్కారమే లేదు. నాలుగు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్‌లో ఈ 'ఖల్ నాయక్' అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను మనకు అందించాడు, తన అద్వితీయ నటనా సామర్థ్యంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు, కాంట్రవర్సీలు, డ్రగ్ ఎడిక్షన్‌తో వార్తల్లో వ్యక్తిగానూ నిలుస్తూ వచ్చాడు సంజయ్. డ్రగ్స్‌కు బానిస కావడమే ఒక బ్లాక్‌బస్టర్ మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందనే విషయం మీకు తెలుసా?
సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన 'హీరో' ఎంత బ్లాక్‌బస్టర్ హిట్టో తెలిసిందే. ఆ సినిమాతో పరిచయమైన జాకీ ష్రాఫ్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అదే సినిమా తెలుగు రీమేక్ 'విక్రమ్'తో అక్కినేని నాగార్జున హీరోగా పరిచయం కావడం గమనార్హం. నిజానికి 'హీరో'గా సుభాష్ ఘాయ్ మొదట ఊహించుకుంది జాకీని కాదు, సంజయ్ దత్‌ను. 'రాకీ'తో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ లుక్స్, అతని నటన ఘాయ్‌ను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో 'విధాత', 'హీరో' చిత్రాలకు హీరోగా అతనితో సంతకం చేయించుకున్నాడు ఘాయ్.
'విధాత' షూటింగ్ మొదలైంది. షమ్మీ కపూర్, దిలీప్ కుమార్ లాంటి దిగ్గజ నటులు అందులో కీలక పాత్రధారులు. కానీ అప్పటికే డ్రగ్స్‌కు బానిస అయిన సంజయ్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించకుండా షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవాడు. దీంతో సంజయ్‌తో గొడవకూడా పడ్డాడు ఘాయ్. 'విధాత'ను ఎలాగో పూర్తి చేసినప్పటికీ, అప్పటికే అతని వ్యవహార శైలి నచ్చని ఘాయ్, 'హీరో' సినిమాకి అతన్ని తొలగించి, జాకీ ష్రాఫ్‌ను తీసుకున్నాడు. దాంతో జాకీ దశ తిరగగా, సంజయ్ కొన్నాళ్ల పాటు డ్రగ్స్ ఎడిక్షన్‌తో బాధపడి, ఎట్టకేలకు తండ్రి సునీల్ దత్ కారణంగా ఆ వ్యసనం నుంచి బయటపడ్డాడు.
![]() |
![]() |