![]() |
![]() |

మలయాళ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వి.వి. వినాయక్‌తో చేతులు కలుపనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' మూవీ పూర్తయ్యాక లూసిఫర్ రీమేక్ షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ రీమేక్‌కు సీనియర్ రైటర్ ఆకుల శివ పనిచేయనున్నట్లు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. గతంలో వినాయక్ పలు సినిమాలకు ఆకుల శివ పనిచేశారు. ఆయన స్వయానా డైరెక్టర్ కూడా. శ్రీహరితో 'సింహాచలం' లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు.
వినాయక్ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దుతూ, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. దీన్ని బట్టి చిత్ర బృందం ప్రి-ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం, ఈ సినిమా 2021 ఫిబ్రవరిలో మొదలవుతుందని ప్రచారంలోకి వచ్చింది. మలయాళ ఒరిజినల్‌లో మోహన్ లాల్ నటించగా, ఈ మూవీతో స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ అయిన ఈ మూవీలో పృథ్వీరాజ్, టొవినో థామస్ ప్రత్యేక పాత్రలు పోషించగా, మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది.
కాగా, ఒరిజినల్‌లో వివేక్ ఓబరాయ్ చేసిన విలన్ రోల్‌ను తెలుగులో రెహమాన్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పృథ్వీరాజ్, టొవినో థామస్ చేసిన పాత్రలను రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో చేయించే ఆలోచనలో వినాయక్ బృందం ఉన్నట్లు వినిపిస్తోంది. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం అజయ్-అతుల్ ఈ సినిమాకి పనిచేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక బృందానికి సంబంధించి అధికారిక ప్రకటనలు ఇంతవరకూ రాలేదు.
![]() |
![]() |