![]() |
![]() |

భారతీయ చిత్రసీమలో గ్లామర్ ప్లస్ టాలెంట్‌కు ప్రతీకగా నిలిచిన ఒక్క తార పేరు చెప్పమంటే ఎవరైనా చెప్పే పేరు శ్రీదేవి. ఆమె ఆ స్థాయికి ఎదగడానికి.. బాలనటిగా సినీ జీవితం ప్రారంభించిన రోజుల నుంచి ఆమె చేసిన కృషి ఎంతో ఉంది. ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె పొందిన కీర్తి ప్రతిష్ఠలు ఆమె తర్వాత మరెవరికీ లభించలేదు. బాలనటిగా వచ్చి దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తొలి నటి శ్రీదేవే!
నటిగా ఎదగాలనే తప్ప నంబర్ వన్ కావాలని కలలు కనలేదని ఒకసారి చెప్పారు శ్రీదేవి. కలలు కనకపోయినా ఆనాటి కుర్రకారుకు మాత్రం కలల రాణిగానే ఆమె మిగిలారు. టాలీవుడ్‌లో లెజెండ్స్‌గా చెప్పుకొనే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలకు కూతురుగా నటించి, ఆ హీరోల సరసన హీరోయిన్‌గా నటించడం ఆమెకే చెల్లింది. ఎన్టీఆర్‌కైతే 'బడిపంతులు' చిత్రంలో మనవరాలిగానూ ఆమె నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున సరసనా హీరోయిన్‌గా నటించడం మరో విశేషం.
.jpg)
ఐదు భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి తెలుగు సినిమా గ్లామరస్ హీరోయిన్‌గానే గుర్తించడం గమనార్హం. తొలిరోజుల్లో 'అనురాగాలు' చిత్రంలో ఆమె అంధురాలిగా నటించారు. 'బంగారక్క'లో శ్రీదేవి నటన చూసిన దాసరి నారాయణరావు ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు. అయితే ఆ తర్వాత తెలుగులో ఆమెలోని నటిని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్లు రాలేదు. ఈలోపు తమిళంలో 'పదనారు వయదునిలే' సినిమా ఆమెకో ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. ఆ చిత్రం తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ కావడం, అందులోనూ ఆమే నటించడంతో శ్రీదేవి ఒక్కసారిగా తారాపథానికి దూసుకెళ్లారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన 'వేటగాడు' చిత్రంలో నటించడంతో తెలుగు సినిమా బాక్సాఫీస్ హీరోయిన్‌గా శ్రీదేవి పేరు మారుమోగి పోయింది. 'హిమ్మత్‌వాలా' సినిమాతో బాలీవుడ్‌లోనూ తన ముద్రవేసి, ఉత్తరాది ప్రేక్షకుల్ని తన పాదాక్రాంతుల్ని చేసుకున్నారు. ఆ కాలంలో అక్కడ టాప్ హీరోయిన్లుగా వెలుగుతున్న తారలకు దడపుట్టించి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. శ్రీదేవి నటన గురించి చెప్పాలంటే 'వసంత కోకిల' సినిమాలో చేసిన పాత్ర ఒక్కటి చాలు. అయితే తర్వాత ఆమె గ్లామరస్ రోల్స్‌కు పరిమితమయ్యారు.
.jpg)
బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను పెళ్లాడి నటనకు కొన్నేళ్ల పాటు విరామమిచ్చి, ఇద్దరు కూతుళ్లకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆమె 'ఇంగ్లీష్ వింగ్లీష్', 'మామ్' సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించి, అనూహ్యంగా అశేష అభిమానుల హృదయాలను బద్దలు చేస్తూ దుబాయ్‌లో బాత్‌టబ్‌లో మృతి చెందారు శ్రీదేవి. ఆమె లాంటి తారను మళ్లీ మనం చూడగలమా?!
.jpg)
![]() |
![]() |