![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసును రామ్ గోపాల్ వర్మ మరోసారి తెరపైకి తీసుకు వచ్చారు. అమృత, మారుతీ రావు గురించి అందరూ చర్చించుకునేలా చేశారు. వర్మ ప్రకటించిన 'మర్డర్' సినిమా అమృత గుండెల్లో మంటలు రేపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు ప్రణయ్ హత్య, మారుతీ రావు ఆత్మహత్యను ఇప్పుడు ఇప్పుడే మరచిపోతున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ మళ్లీ గుర్తు చేశారు. వర్మ సినిమా ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అమృత పేరుతో ఒక లెటర్ చక్కర్లు కొట్టింది. అయితే, ఆ లెటర్ అమృత రాయలేదు. ఎవరో రాశారు. తన పేరుపై సోషల్ మీడియా పోస్ట్ చేసిన వాళ్ళ పై అమృత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్మ సినిమా ప్రకటన, తరవాత తన పేరు పై సోషల్ మీడియాలో లెటర్ రావడంతో ప్రణయ్ భార్య అమృత మీడియా ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఫేక్ పోస్ట్ అని స్పష్టం చేశారు. వర్మ సినిమాకు తన జీవితానికి సంబంధం లేదని తెలిపారు. అంతేకాదు తన పేరు మీద పోస్ట్ చేసిన వాళ్ళపై కేసు పెడతానని అమృత చెప్పారు. నిజానికి, సోషల్ మీడియా పోస్ట్ అమృతకు అనుకూలంగానే ఉంది. అది చదివిన వాళ్ళు ఎవరైనా ఆమెకు మద్దతు ఇచ్చేలా ఉంది. అయితే, ఆ లెటర్ రావడానికి... అసలు వివాదానికి కారణమైన వర్మను అమృత వదిలేసారు. సోషల్ మీడియా పోస్ట్ చేసిన వాళ్ళపై కేసు పెడతానని అంటున్నారు. ఇదేమి విచిత్రమో! వర్మ వివాదాలలో సరికొత్త కోణమిది. అమృత నుండి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఆమె పేరును ఉపయోగించుకుంటూ సినిమాకు ప్రచారం పొందుతున్న వర్మ పై కేసు వేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |