![]() |
![]() |

1990 జూన్ 22.. అంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున బాలీవుడ్‌లో ఓ అద్భుతం జరిగింది. అదేమిటంటే.. ఆ రోజున విడుదలైన రెండు సినిమాలు ఆ సంవత్సరంలోనే 'టాప్ 2' హయ్యెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. అంతేకాదు.. అవార్డులు, రివార్డులు, రికార్డులు, రీమేక్స్.. ఇలా ఎన్నో అంశాలకు చిరునామా అయ్యాయి. ఆ చిత్రాలే.. ‘దిల్’, ‘ఘాయల్’.
ఆమిర్ ఖాన్, మాధురీ దీక్షిత్ హీరోహీరోయిన్లుగా ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ ‘దిల్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి ఆ యేటి హయ్యెస్ట్ గ్రాసర్‌గా నమోదయింది. అలాగే.. తెలుగులో ‘తొలిముద్దు’ (ప్రశాంత్, దివ్యభారతి) పేరుతోనూ, ఒడియాలో ‘అగ్నిపరీక్ష్య’ పేరుతోనూ, కన్నడలో ‘శివరంజని’ పేరుతోనూ, బంగ్లాదేశ్‌లో ‘అమార్ ఘోర్ అమార్ బెహెస్తో’ పేరుతోనూ రీమేక్ అయింది. అలాగే.. ‘ఫిలింఫేర్’లో మాధురీ దీక్షిత్‌కి ‘ఉత్తమ నటి’ విభాగంలో పురస్కారం దక్కింది. మొత్తంగా అటు ఆమిర్, ఇటు మాధురీ దీక్షిత్ కెరీర్‌లో ఓ మెమరబుల్ ఫిలింగా నిలిచింది.

ఇక ‘ఘాయల్’ విషయానికొస్తే.. సన్నీ డియోల్, మీనాక్షి శేషాద్రి నాయకానాయికలుగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. ఆ సంవత్సరం సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘బెస్ట్ యాక్టర్’ (సన్నీ డియోల్), ‘బెస్ట్ ఫిలిమ్’ (నిర్మాత: ధర్మేంద్ర), ‘బెస్ట్ డైరెక్టర్’ (రాజ్ కుమార్ సంతోషి), ‘బెస్ట్ స్టోరీ’ (రాజ్ కుమార్ సంతోషి), ‘బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్’(నితీష్ రాయ్), ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’ (రజన్ కొఠారి), ‘బెస్ట్ ఎడిటర్’(వీయన్ మయేకర్).. ఇలా ఏడు కీలక విభాగాల్లో ‘ఫిలింఫేర్’ పురస్కారాలను సొంతం చేసుకుంది ‘ఘాయల్’. అలాగే ‘బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్’ (ధర్మేంద్ర), ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్’ (సన్నీ డియోల్) విభాగాల్లో రెండు ‘జాతీయ పురస్కారాల’ను కూడా సొంతం చేసుకుంది. అదే విధంగా.. తెలుగులో ‘గమ్యం’ (శ్రీకాంత్, రవళి), తమిళంలో ‘భరతన్’ (విజయ్‌కాంత్, భానుప్రియ), కన్నడలో ‘విశ్వ’ (శివ రాజ్‌కుమార్, సుచిత్రా కృష్ణమూర్తి) పేర్లతో రీమేక్ అయింది.

ఇలా.. ఒకే రోజు రిలీజైన ‘దిల్’, ‘ఘాయల్’ ఆ యేటి మేటి గ్రాసర్స్‌గా నిలవడం.. అవార్డులు, రివార్డులు, రికార్డులు, రీమేక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడం ఇప్పటికీ సంచలనమే.
కొసమెరుపు ఏమిటంటే.. ‘దిల్’, ‘ఘాయల్’ విడుదలైన 11 ఏళ్ళ తరువాత అంటే 2001లో ఇదే జూన్ నెలలో ఒకే రోజున (జూన్ 15) ఆమిర్ ఖాన్ ‘లగాన్’, సన్నీ డియోల్ ‘గదర్’ విడుదల కావడమే కాకుండా.. ఆ యేటి మేటి గ్రాసర్స్‌గా నిలిచాయి. మొత్తమ్మీద వేర్వేరు సంవత్సరాల్లో జూన్ నెల వేదికగా ఆమిర్, సన్నీ డియోల్ ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రెండు సార్లు దిగడం.. మెమరబుల్ హిట్స్‌ని నమోదు చేసుకోవడం బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.
![]() |
![]() |