![]() |
![]() |

డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కచ్చితంగా 'జనగణమన' మూవీని తీస్తానని చెప్పారు. "జనగణమన అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతి త్వరలో దాన్ని తియ్యడానికి ప్లాన్ చేస్తున్నా" అని ఆయన చేసిన ప్రకటనను పూరి కనెక్ట్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
ఎంతో కాలంగా 'జనగణమన' చిత్రాన్ని తీయాలని పూరి జగన్నాథ్ అనుకుంటూ వస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌తో ఆ మూవీని తీయాలని ఆయన భావించారు. అయితే ఇంతవరకూ అది వాస్తవ రూపం దాల్చకపోవడంతో, ఆ సినిమాని ఇక పూరి తీయరేమో అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతూ వస్తున్నాయి. వీటికి తాజా ప్రకటనతో పూరి జగన్నాథ్ చెక్ చెప్పారు. 'జనగణమన' పాన్ ఇండియా ఫిల్మ్‌గా తయారవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టోటల్ స్క్రిప్టును లాక్‌డౌన్ టైమ్‌లో ఆయన పూర్తి చేశారు. స్క్రిప్టు అద్భుతంగా వచ్చిందని సమాచారం.
పూరి 'జనగణమన' మూవీని మహేశ్‌తో చేస్తారా, మరో హీరోతో చేస్తారా.. అనే విషయం త్వరలోనే వెల్లడి కానున్నది. ఇటీవల ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా పూరి జగన్నాథ్ ఎప్పుడు కథ చెప్తారా అని ఎదురు చూస్తున్నానని మహేశ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరి 'జనగణమన'ను త్వరలోనే పాన్ ఇండియా ఫిల్మ్‌గా తీస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

![]() |
![]() |