![]() |
![]() |

‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ ఆధారంగా తెరకెక్కిన సదరు చిత్రం చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది. ఆ సినిమా అందించిన విజయోత్సాహంతో డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా.. నరసింహారెడ్డి’ చేశారాయన. కొన్ని చోట్ల నష్టాలు వచ్చినా ‘ఖైదీ నంబర్ 150’ కంటే మిన్నగా వసూళ్లు చూసి చిరు కెరీర్‌లో మరో హయ్యస్ట్ గ్రాసర్‌గా నమోదైంది ‘సైరా’. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కొణిదెల స్టార్.. ప్రస్తుతం ‘ఆచార్య’తో ‘హయ్యస్ట్ గ్రాసర్’ కోణంలో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్‌తో తాత్కాలికంగా షూటింగ్ పరంగా బ్రేక్ పడింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో గురుశిష్యుల పాత్రల్లో చరణ్, చిరు దర్శనమిస్తారని టాక్. కాగా, తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన యూనిట్.. పలు కారణాలతో ఇప్పుడా ఆలోచనను విరమించుకుందట. కుదిరితే ఈ ఏడాది దసరాకి లేదంటే రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ కనుక వాయిదా పడితే 2021 సంక్రాంతికి.. ‘ఆచార్య’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారట ఫిల్మ్ మేకర్స్.
అదే గనక నిజమైతే రీ-ఎంట్రీలో చిరు మూడు వరుస చిత్రాలు పండగ సీజన్లనే టార్గెట్ చేసుకున్నట్టు. 2017 సంక్రాంతికి ‘ఖైదీ నంబర్ 150’ సందడి చేస్తే.. 2019 దసరా సీజన్‌లో ‘సైరా.. నరసింహారెడ్డి’ వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే 2020 దసరా లేదా 2021 సంక్రాంతికి ‘ఆచార్య’ రాబోతుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఫెస్టివల్ సీజన్స్‌లోనే వచ్చి బ్యాక్ టు బ్యాక్ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్‌ను చూసిన చిరు.. ‘ఆచార్య’తోనూ ఆ పరంపరను కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |