![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీ పై కరోనా ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. షూటింగులు, థియేటర్లు, సినిమా బడ్జెట్లు, లగ్జరీలు... వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు. ఈ ప్రభావాన్ని తట్టుకుని పరిశ్రమ ఎలా ముందుకెళ్తుంది అనేది అతి పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పలు విషయాలపై మాట్లాడారు. ఇంతకీ, ఆయన ఏమన్నారంటే....
• ఆరు నుండి ఎనిమిది నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేయకపోవచ్చునని అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా... నిబంధనలకు లోబడి ఓపెన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయేమో!
• లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మార్చికి ముందున్న పరిస్థితులు మళ్లీ వస్తాయని ఎదురుచూడడంలో అర్థం లేదు. అలా చూస్తూ కూర్చుంటే మనం వెనకబడిపోతాం. కరోనా వల్ల ప్రపంచం మారుతోంది. ఆల్రెడీ మారింది కూడా!
• డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వల్ల సినిమా థియేటర్లకు వచ్చే ముప్పు ఏమీ లేదు. టీవీలో వచ్చిన కొత్తల్లో థియేటర్లకు ఎవరూ రారు అని అనుకున్నారు. టీవీ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కూర్చోవడంతో... టీవీ నుండి కొందరు థియేటర్ నుండి కొందరు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు వెళతారు. అయితే... హ్యూమన్ బీయింగ్ అనేవాడు సోషల్ యానిమల్. థియేటర్లో ప్రేక్షకులతో కలిసి నవ్వాలని, అరవాలని గోల చేయాలని అనుకుంటాడు. కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.
• సినిమా పరిశ్రమను కరోనాకి ముందు, కరోనా సమయంలో కరోనా తర్వాత అని డివైడ్ చేయాల్సిందే. కరోనా సమయంలో డిజిటల్ కంటెంట్ ఎక్కువ వెళుతుంది. అలాగని, థియేటర్ ల కోసం చేసిన కంటెంట్ డిజిటల్ కి సూట్ అవ్వదు. కొంత మాత్రమే సూట్ అవుతుంది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ లగ్జరీలు తగ్గించుకోవాలి. సినిమా బడ్జెట్లు కూడా తగ్గుతాయి.
![]() |
![]() |