![]() |
![]() |

మహేశ్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన 'శ్రీమంతుడు' (2015) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయి, మహేశ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. సంపన్న కుటుంబానికి చెందిన హర్ష అనే యువకుడు తన సొంత ఊరు ఏదో తెలుసుకొని, అక్కడకు వెళ్లి, ఆ ఊరిని దత్తత తీసుకొని దానిని బాగు చేయడమే కాకుండా, ఆ ఊరిని కబ్జా చేద్దామనుకున్న దుండగుల పీచమణచడం ఆ చిత్ర కథ. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చడమే కాదు, సమాజంపైనా ప్రభావం చూపించింది. అంతేకాదు, సైకిళ్లకు డిమాండ్ తీసుకొచ్చిన సినిమాగా కూడా అది పేరు తెచ్చుకుంది. ఒక కమర్షియల్ సినిమా సమాజంపైన ప్రభావం చూపడం ఇటీవలి కాలంలో దానితోనే చూశాం.
ఇప్పటికీ ఆ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని టీవీలో ఆ మూవీ ప్రసారమైనప్పుడల్లా దానికి వస్తున్న రేటింగ్స్ తెలియజేస్తూనే ఉన్నాయి. కాగా లేటెస్ట్గా యూట్యూబ్‌లోనూ ఆ సినిమా దుమ్ము రేపింది. ఇటీవలి కాలంలో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన పాటలు చూస్తున్నాం కానీ, వంద మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాల్ని మాత్రం చూడ్డం లేదు. ఆ లోటును 'శ్రీమంతుడు' తీర్చింది. ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తన యూట్యూబ్ చానల్లో 2017 సెప్టెంబర్‌లో అప్లోడ్ చేయగా, ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, ఈ విషయంలోనూ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. అలా మహేశ్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది 'శ్రీమంతుడు'.
![]() |
![]() |