![]() |
![]() |

కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా నిరంతరం పని చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్‌ను తుదముట్టించడంలో పారిశుద్ధ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు, నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు. వాళ్ల శ్రమను, వాళ్ల సేవలను గుర్తించిన లేటెస్ట్ సెలబ్రిటీ సూపర్‌స్టార్ మహేశ్. మన పరిసరాలను శుభ్రం చేస్తున్న కార్మికులకు సంబంధించి ఐదు పిక్చర్లను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేశ్, వాళ్లకు నమస్కారాలు తెలిపాడు.
"మన పరిసరాల్ని శుభ్రం చేయడానికీ, శానిటైజ్ చేయడానికీ మన వీధుల్లో విధులు నిర్వర్తిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నా. మనం ఇళ్లల్లో క్షేమంగా ఉంటుంటే, వాళ్లు ప్రతిరోజూ తమ ఇళ్లను వదిలి, మనకు హాని కలుగకుండా చూసుకుంటున్నారు. తమ ఉద్యోగాల్లోని సవాళ్లను మించి ఈ భయంకర వైరస్‌తో నిరంతర యుద్ధం చేయడం ఒక సవాలు. దాన్ని వారు మనకోసం చేస్తున్నారు. వాళ్లపై నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అపారమైన గౌరవం, అంతులేని ప్రేమను ప్రకటిస్తున్నాను. మీలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆశీర్వాదాలు" అని ఆయన రాసుకొచ్చాడు. తన పోస్ట్‌కు #InItTogether, #wearewithyou, #OneWorld అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.
![]() |
![]() |