![]() |
![]() |

రాజకీయాల్లో రాణించిన సినీ ప్రముఖులు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు (NTR). తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)ని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప పనులు చేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో సత్తా చాటిన సినీ ప్రముఖులు లేరనే చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినవారు ఉన్నారు కానీ.. సొంతంగా పార్టీని స్థాపించి, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినవారు లేరు. అయితే మిగతా వారితో పోలిస్తే.. ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా.. మెచ్చుకోదగ్గ రాజకీయ ప్రయాణం చేస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు చెప్పుకోవచ్చు.
సాధారణంగా సినీ ప్రముఖులు రిటైర్ మెంట్ వయసులో రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో జనసేన పార్టీ (Janasena Party)ని స్థాపించిన పవన్.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నూతన రాష్ట్రానికి అనుభవమున్న నాయకుడు అవసరమని భావించిన ఆయన.. ఏమీ ఆశించకుండా చంద్రబాబుకి తన పూర్తి మద్దతు తెలిపారు. అలా చేయడాన్ని కొందరు తప్పుబట్టినా.. పవన్ మాత్రం వెనకడుగు వేయలేదు. తాను ప్రజలకు మంచి చేయడం కోసం పార్టీని స్థాపించానని, ఆ దిశగానే తన అడుగులు ఉంటాయని, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే.. నిర్మొహమాటంగా తన వాళ్ళని కూడా ప్రశ్నించారు. అందుకే నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచారు.
2014 లో చంద్రబాబుకి మద్దతు తెలిపిన పవన్.. 2019లో చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడూ పవన్ కళ్యాణ్ తీరుని కొందరు తప్పుబట్టారు. నిలకడలేని రాజకీయాలని విమర్శించారు. కానీ పవన్ మాత్రం తాను నమ్మిన దారిలోనే పయనించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఎమ్మెల్యేగా ఓడిపోయినా నిరాశచెందలేదు. పవన్ కళ్యాణ్ స్థానంలో వేరొకరు ఉన్నట్లయితే.. రాజకీయాలు పూర్తిగా వదిలేసి, మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ పవన్ అలా చేయలేదు. ఎన్నో అవమానాలను తట్టుకొని నిలబడ్డారు.
మన లక్ష్యం గొప్పదైతే సరిపోదు.. దానిని నెరవేర్చుకోవాలంటే నిజాయితీగా ప్రయత్నించాలి, సహనంతో ఎదురు చూడాలి. ఆ నిజాయితీ, సహనం పవన్ కళ్యాణ్ లో ఉన్నాయి కాబట్టే.. నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. అలాగే ఆయనలో ముందుచూపు కూడా ఉంది. అందుకే సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకొని.. రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి శ్రీకారం చుట్టి.. ఐదేళ్లుగా అరాచక పాలనలో బందీ అయిన రాష్ట్రానికి విముక్తిని కలిగించారు.
నిజానికి 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబుతో కలిసి పవన్ పోటీ చేయడాన్ని ఎందరో తప్పుబట్టారు. ప్రత్యర్థి పార్టీ నుంచి విమర్శలే కాదు.. సొంత వాళ్ళ నుంచి మాటలు కూడా పడ్డారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్ల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని, ఇలాంటి వాడు జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేడని నానా మాటలు అన్నారు. సొంత వాళ్ళతో "నన్ను, నా వ్యూహాన్ని నమ్మండి" అని చెప్పిన పవన్.. ప్రత్యర్థులతో మాత్రం "మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తాను" అని సవాల్ చేశారు. చెప్పినట్టుగానే చేసి చూపించారు. జనసేన పార్టీని పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించుకోవడమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీ పునాదులు కదిలేలా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేడని విమర్శించిన వారి చేతే.. శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు "కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను" అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు.. అన్నింటిని తట్టుకొని నిలబడి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. నిజాయితీ, సహనం, ఆలోచన ఉంటే ఏదైనా సాధించగలమని పవన్ నిరూపించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశిద్దాం.
![]() |
![]() |