![]() |
![]() |
టెక్నాలజీని సక్రమంగా వాడితే దానంత ఉపయోగకారి మరొకటి ఉండదు. అలాగే దాన్ని దుర్వినియోగం చేస్తే జరిగే పరిణామాలు మామూలుగా ఉండవు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. తాజాగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఎఐ టెక్నాలజీ. దీనివల్ల జరిగే ప్రయోజనం మాట పక్కన ఉంచితే, అనర్థాలే ఎక్కువగా ఉన్నాయని ఇటీవల జరిగిన కొన్ని ఘటనల వల్ల తెలుస్తోంది. ముఖ్యంగా మనదేశంలోని కొందరు హీరోయిన్లను ఎఐ టెక్నాలజీ ద్వారా అసభ్యంగా చూపించడంతో దానిపై అందరిలోనూ దురభిప్రాయం ఏర్పడిరది. అయితే ఎఐతో ఆందోళనే కాదు, ఆహ్లాదాన్ని కూడా కలిగించవచ్చు అని ఒక వీడియో ప్రూవ్ చేస్తోంది.
అందాల నటుడు శోభన్‌బాబు ఇప్పుడు మోడ్రన్ లుక్‌లో మన ముందుకు వచ్చాడు. అప్పట్లో ఆంద్రుల అందగాడుగా, సోగ్గాడుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శోభన్‌బాబు కొత్తగా మన ముందుకు రావడం వెనుక ఎఐ టెక్నాలజీ సహకారం ఎంతో ఉంది. బీచ్‌లో శోభన్‌బాబు నడిచి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ శోభన్‌బాబు హాలీవుడ్ హీరోలా ఉన్నారని కొందరంటే.. మహేష్‌బాబు బాడీకి శోభన్‌బాబు తల అతికించినట్టుగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎలా క్రియేట్ చేసినా, ఎవరిలా ఉన్నా చూసేందుకు కన్నుల పండువగా ఉంది. ఈ టెక్నాలజీ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉండగా, దాన్ని దుర్వినియోగం చేసి అందర్నీ ఆందోళనకు గురిచేయడం సరైనది కాదని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |