![]() |
![]() |
తెలుగు సినిమా అంటే.. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు అనే ఫార్ములా ఒకప్పుడు ఉండేది. ఈ ఫార్ములాతో సిల్వర్ జూబ్లీ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఫార్ములా సినిమాలకు కాలం చెల్లింది. కానీ, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం హీరోలు, దర్శకులు కూడా అప్‌డేట్ అయ్యారు. ప్రేక్షకులు కోరుకున్న విధంగా సినిమాలు తీసి వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్ములా సినిమాలను పక్కన పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్‌తోనే ట్రెండ్ మారుతూ వస్తోంది. ట్రెండ్‌కి అనుగుణంగానే హీరోలు కూడా తమ సినిమాలు ఎలా ఉండాలి అనే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ హీరోతోనూ తాను పోటీ కాదు అంటూ తన పద్ధతిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళే హీరోలు కొందరు ఉన్నారు. వారిలో అడివి శేష్ ఒకరు.
‘కర్మ’ చిత్రంతో అందర్నీ ఆకర్షించిన శేష్ ఆ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్, సహనటుడిగా కనిపించాడు. అయితే తన టార్గెట్ వేరు, తన ఆలోచన వేరు. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్లాట్‌ను ఏర్పరుచుకొని ప్రేక్షకుల్ని అందులోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు, క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి సినిమాలు దానికి ఉదాహరణ. కథ, కథనాలతోపాటు టెక్నికల్‌గా కూడా సినిమా ఓ ప్రత్యేకతను కలిగి ఉండాలి. అదే అతని ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తూ తన అభిరుచికి తగ్గ సినిమాలు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాలు చేసేందుకు అడివి శేష్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రస్తుతం శేష్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి కోసం కొత్త తరహా సినిమాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నాడు.
2023 సంవత్సరంలో శేష్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. దానికి కారణం విభిన్నమైన, వైవిధ్యమైన సినిమాలు చెయ్యాలి తప్ప సంవత్సరానికి ఇన్ని సినిమాలు చెయ్యాలి అనే టార్గెట్ ఏమీ తాను పెట్టుకోలేదని చెప్తాడు. ప్రస్తుతం గూఢచారి 2 సినిమా వర్క్‌లో బిజీగా ఉన్నాడు. గూఢచారి మించిన రేంజ్‌లో సెకండ్ పార్ట్‌ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను ఐదు దేశాల్లో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేశారు. ఈమధ్య తను చేస్తున్న సినిమాలకు కథ కూడా తనే అందిస్తున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గత నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఇటీవల వచ్చిన అడివి శేష్ సినిమాలను గమనిస్తే టేకింగ్ పరంగా గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగాగానీ హాలీవుడ్ రేంజ్‌లో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు గూఢచారి 2 చిత్రాన్ని కూడా ఓ రేంజ్‌లో ప్రజెంట్ చేసేందుకు కృషి చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |