![]() |
![]() |

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో పలు ఎవర్ గ్రీన్ సినిమాలు వచ్చాయి. అందులో 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా కూడా ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా రూపొందిన ఈ సినిమా, 1992 సెప్టెంబరులో విడుదలై ఘన విజయం సాధించింది. 30 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఈ సినిమాని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఎవర్ గ్రీన్ టైటిల్ తో అలరించడానికి ఈవీవీ తనయుడు అల్లరి నరేష్ సిద్ధమవుతున్నాడు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు ఎక్కువగా చేస్తూ, ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. 'నాంది' నుంచి రూట్ మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది 'ఉగ్రం'తో పలకరించిన నరేష్.. 'నా సామి రంగ'లో కీలక పాత్ర పోషించడంతో పాటు, 'బచ్చలమల్లి'లో లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా నరేష్ మరో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. టైటిల్ ని బట్టి చూస్తే నరేష్ దృష్టి మళ్ళీ కామెడీ వైపు మళ్లినట్లు అనిపిస్తోంది. మరి తన తండ్రి ఈవీవీ ఎవర్ గ్రీన్ టైటిల్ 'ఆ ఒక్కటీ అడక్కు' నరేష్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |