![]() |
![]() |
ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావాలంటే సమిష్టి కృషి ఎంతో అవసరం. నటీనటులు, 24 క్రాప్ట్స్‌లోని టెక్నీషియన్స్ అంతా కలిసి మెలిసి పనిచేస్తేనే మంచి ఔట్‌పుట్ వస్తుంది. అయితే వారి మధ్య తలెత్తే అభిప్రాయ భేదాల వల్ల కొనిసార్లు షూటింగ్స్ డిస్ట్రబ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. షూటింగ్ పూర్తయి, ఔట్‌పుట్ బాగా వచ్చిందంటే అవన్నీ మర్చిపోతుంటారు. అయితే కొన్నిసార్లు ఇవే అభిప్రాయ భేదాలు జఠిలంగా మారతాయి. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇది ఒకవైపు అయితే.. మరో వైపు ఒక సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది అంటే అదంతా టీమ్ వర్క్ అని చెబుతుంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే అంతా డైరెక్టర్ వల్లే జరిగిందని అతనిపై నింద వేసేస్తుంటారు. అన్ని సినిమాలకూ అలా జరగకపోయినా ఎక్కువ శాతం ఇలాంటి మాటలు మనం వింటూ వుంటాం.
పైన చెప్పుకున్న విధంగా కాకుండా ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడ్నే పక్కకు తప్పించి తానే దర్శకుడ్ని అంటూ నిర్మాత పేరు వేసుకుంటే.. అప్పుడు ఆ డైరెక్టర్ మానసిక స్థితి ఎలా ఉంటుంది. తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ విషయంలో ఇలాంటి వివాదమే జరుగుతోంది. మొదట ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకుడు. షూటింగ్ పూర్తయి రిలీజ్‌కి వస్తోందనిపించుకున్న తర్వాత డైరెక్టర్‌ని పక్కకి తప్పించి తానే దర్శకుడ్ని కూడా అంటూ అభిషేక్ నామా పోస్టర్లపైన పేరు వేసుకున్నారు. మొదట్లో ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడని నవీన్ మేడారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో నిర్మాత అభిషేక్ నామాదే తప్పుగా తేలుస్తున్నారు నెటిజన్లు. నవీన్ మేడారం ట్విట్టర్‌లో స్పందించిన తర్వాత అభిషేక్ నామాపై ట్రోలింగ్ పెరిగింది. డిసెంబర్ 29న ‘డెవిల్’ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాత, దర్శకుడి మధ్య వివాదం మరింత ముదురుతోంది.
ఈ విషయంపై నిర్మాత అభిషేక్ నామా స్పందిస్తూ.. దర్శకుడిగా సినిమాను సరిగా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్ల రెండో రోజే నవీన్‌ని పక్కన పెట్టామని అంటున్నారు నిర్మాత. ఈ విషయంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ సినిమాను అతను సరిగా చెయ్యలేడని షూటింగ్ మొదట్లోనే తమకు అర్థమైందని, టీమ్ అంతా కలిసి కలెక్టివ్‌గానే నిర్ణయం తీసుకున్నామని, హీరో కళ్యాణ్‌రామ్ కూడా ఈ విషయాన్ని తనకే వదిలేశాడని అభిషేక్ చెబుతున్నాడు. అయితే ఈ విషయంలో నిర్మాత అభిషేక్‌నే టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. కావాలనే దర్శకుడ్ని పక్కన పెట్టారంటూ అభిషేక్‌ను విమర్శిస్తున్నారు. దీంతో అభిషేక్ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తన జీవితాన్నే ఈ సినిమాకి ఫణంగా పెట్టి 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా చేశానని అంటున్నారు. తనపై వస్తున్న విమర్శల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, అకారణంగా తనను, తన కుటుంబాన్ని నిందిస్తున్నారని అభిషేక్ వాపోతున్నారు. నిర్మాత, దర్శకుడు ఎవరికి వారు తమ తప్పు లేదంటూ తగిన కారణాలు చూపుతున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
![]() |
![]() |