![]() |
![]() |
ఈ ఏడాది విడుదలైన సినిమాలు కొన్ని బ్లాక్‌బస్టర్స్ అయితే.. మరికొన్ని బాక్సాఫీస్ వద్డ బోల్తా కొట్టాయి. ఏ హీరో సినిమా ఎలా ఉన్నా తాము చేసిన రెండు సినిమాలతో ఘనవిజయాలను అందుకున్న హీరోలు నటసింహ నందమూరి బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇస్తే.. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో నాని విజయకేతనాన్ని ఎగరేశాడు. ఎవరి స్థాయిలో వారు తమ సినిమాలను సూపర్‌హిట్ చేసి కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో మరోసారి బాలకృష్ణ తప నట విశ్వరూపాన్ని చూపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఓ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. వీరసింహారెడ్డిగా బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కి, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వరల్డ్ వైడ్‌గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక దసరా కానుకగా విడుదలైన ‘భగవంత్ కేసరి’తో మరోసారి విజృంభించారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ ఓ కొత్త అవతార్‌లో కనిపించారు. ఆడపిల్లను ఆడ పులిలా పెంచాలి అనే అద్భుతమైన సందేశంతో రూపొందిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలకృష్ణకు మరో ఘన విజయాన్ని అందించింది. ఇప్పటివరకు బాలకృష్ణ చేయని ఓ కొత్త తరహా క్యారెక్టర్స్‌తో అందర్నీ అలరించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సినిమాలను రూపొందించే అనిల్ రావిపూడితో భారీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేసి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు బాలయ్య.
ఇక నేచురల్ స్టార్ నాని విషయానికి వస్తే.. తను చేసే సినిమాల ఎంపికలో ఎంతో వైవిధ్యాన్ని కనబరిచే నాని అలాంటి రెండు వైవిధ్యమైన సినిమాలతో ఘనవిజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలను కొత్త దర్శకులే రూపొందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ‘దసరా’ చిత్రంతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన నాని, ‘హాయ్ నాన్న’ చిత్రంతో శౌర్యువ్‌ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు.
ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ‘దసరా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాలన్నీ క్లాస్ టచ్‌తో ఉన్నాయి. ‘దసరా’లో మాత్రం హెయిర్ స్టయిల్‌తో సహా కొత్తలుక్‌తో కనిపించాడు. క్లాస్ సినిమాలతోనే కాదు, మాస్ సినిమాలతోనూ హిట్ కొట్టగలనని ప్రూవ్ చేశాడు నాని. ఈ సినిమాలో ధరణిగా నాని చేసిన అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్‌గా రూ.115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి నాని సినిమాల్లోనే హయ్యస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
‘దసరా’ వంటి మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో పూర్తి వేరియేషన్ చూపించాడు నాని. క్లాస్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా నానికి మరో ఘన విజయాన్ని అందించింది. నానికి కొట్టిన పిండిలాంటి రొమాంటిక్ డ్రామాతో శౌర్యువ్ మరో అద్భుతాన్ని సృష్టించాడు. డిసెంబర్ 7న విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రం ‘దసరా’ స్థాయి కలెక్షన్లు సాధించకపోయినా మంచి వసూళ్లతో పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లాస్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఓ పక్క మాస్ హీరో, మరో పక్క క్లాస్ హీరో.. ఈ ఇద్దరూ ఈ ఏడాది పెద్ద సంలచలనమే సృష్టించారు. ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో నందమూరి అభిమానులు, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో నాని అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ అభిమాన హీరోలు చేసే నెక్స్‌ట్ సినిమాపై దృష్టి పెట్టారు. రాబోయే చిత్రాలతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ కొడతారన్న ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది.
![]() |
![]() |