![]() |
![]() |

ఈ ఏడాది పలువురు కొత్త దర్శకులు సత్తా చాటారు. అందులో మొదటి సినిమాకే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన వారున్నారు. కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి, కాసులతో పాటు ప్రశంసలు పొందిన వారు కూడా ఉన్నారు.
వేణు ఎల్దండి:
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి.. 'బలగం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చేవరకు వేణులో ఇంత మంచి కథకుడు, దర్శకుడు ఉన్నాడని ఎవరూ అంచనా వేయలేకపోయారు. బలగం కోసం వేణు, తెలంగాణ పల్లె మట్టి నుంచి పుట్టిన కుటుంబ కథను ఎంచుకున్నాడు. చావు చుట్టూ కథని అల్లుకున్నప్పటికీ, దానికి వినోదాన్ని జోడించి.. నవ్విస్తూనే ఏడిపిస్తూ బంధం విలువ, బలగం విలువని చాటిచెప్పాడు. కేవలం కోటి రూపాయల బిజినెస్ చేసిన ఈ మూవీ.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఏకంగా రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం విజయం సాధించింది.
శ్రీకాంత్ ఓదెల:
మొదటి సినిమాతో విజయం సాధించడమే విశేషం. అలాంటిది మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం నిజంగా గొప్ప విశేషం. 'దసరా' చిత్రంతో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాంటి ఘనతనే సాధించాడు. మొదటి సినిమాకే పీరియడ్ యాక్షన్ డ్రామా వంటి జానర్ ను ఎంచుకున్న శ్రీకాంత్.. నేచురల్ స్టార్ నానిని ఊర మాస్ అవతార్ లో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలను కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ మూవీతోనే స్టార్స్ ని డీల్ చేయగల మంచి కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడనే పేరు తెచ్చుకోగలిగాడు.
షణ్ముఖ ప్రశాంత్:
వినోదం, భావోద్వేగంతో కూడిన సున్నితమైన కథలను తెరకెక్కించి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ 'రైటర్ పద్మభూషణ్'తో దర్శకుడిగా పరిచయమైన షణ్ముఖ ప్రశాంత్ మాత్రం.. మొదటి సినిమాకే ఆ తరహా కథని ఎంచుకొని మెప్పించగలిగాడు. కొడుకు గెలుపు కోసం తపన పడే తల్లి కథగా, తల్లి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే కొడుకు కథగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కళ్యాణ్ శంకర్:
నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా వచ్చిన 'మ్యాడ్'తో కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
శివ ప్రసాద్ యానాల:
కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో ప్రేక్షకుల మనసు దోచుకున్న 'విమానం' సినిమాతో శివ ప్రసాద్ యానాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. విమానం ఎక్కాలనే పదేళ్ల కొడుకు చివరి కోరిక కోసం.. ఓ పేద తండ్రి సాగించిన ప్రయాణంగా రూపొందిన విమానం చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది.
క్లాక్స్:
'బెదురులంక 2012' అనే కామెడీ డ్రామాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు క్లాక్స్. 2012లో యుగాంతం వార్తల కారణంగా ఓ పల్లెటూరిలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
శౌర్యువ్:
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'హాయ్ నాన్న' చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తండ్రీకూతుళ్ల కథతో ఎమోషనల్ జర్నీగా సాగిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, మంచి విజయాన్ని నమోదు చేసింది.
![]() |
![]() |