![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం ఉగాది పర్వదినాన శనివారం కనులపండువగా ప్రారంభమైంది. ఈ వేడుక హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో జరిగింది. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, తేజ్ నారాయణ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్‌ని అందజేసారు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించారు.
అలాగే టైగర్ నాగేశ్వరరావు ప్రీలుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "టైగర్ నాగేశ్వరరావు కథను పేండమిక్ టైంలో దర్శకుడు వంశీ నాకు కథ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ స్టువర్ట్ పురం నాగేశ్వరరావు గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. మా నాన్నగారు చీరాల పేరాలలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ పక్కనే స్టువర్ట్పురం వుండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆసక్తితో నాన్నగారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ తర్వాత ఆయన గురించి వంశీ కమర్షియల్ కథగా తీర్చిదిద్దారు. తమ్ముడు రవితేజ సినిమా చేయడం శుభం. అందుకు అభిషేక్ అగర్వాల్ పూనుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇటీవలే వారు కశ్మీర్ ఫైల్స్‌తో సక్సెస్ మూడ్‌లో వున్నారు. కొత్త సంవత్సరంలో పూర్తయి త్వరగా విడుదలయి కశ్మీర్ ఫైల్స్ ఎంత హిట్టయిందో అంతకంటే హిట్ అయి రవితేజకు, అభిషేక్‌కు, వంశీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "జీవితంలో తీపి, చేదు, వగరు ఇలాంటి ఎన్నో అనుభూతులు కలిగించే ఉగాది నాడు టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రారంభోత్సవం కావడం ఆనందంగా వుంది. అభిషేక్ అగర్వాల్, వారి నాన్నగారు అనేక ఏళ్ళుగా కుటుంబ మిత్రులు. ఇటీవలే వారు కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి భారతీయులందరికీ పండిట్ల కథను తెలిసేలా చేశారు. దర్శకుడు వివేక్ సాధ్యమైనమేరకు కథను చూపించగలిగారు. ఇంకా చాలా విషయాలు పండిట్ల గురించి చర్చించాల్సి వుంది. చాలా మంది సినిమాలు తీస్తారు. దేశానికి ఉపయోపడే సినిమాలు కొన్నే వుంటాయి. ఉపయోగపడే సినిమా తీసిన అభిషేక్‌ను అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా టైగర్ నాగేశ్వరరావు కథను తీస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను" అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. "చిరంజీవిగారి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా వుంది. రవితేజతో నాలుగేళ్ళుగా ప్రయాణం చేశాను. ఈ కథకు ఆయనే బాగుంటుందని అనుకోవడం, ఆయన అందుకు ఒప్పుకోవడంతో మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చారు. రవితేజ ఫ్యాన్సేకాదు తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చే చిత్రమవుతుందని హామీ ఇస్తున్నాను" తెలిపారు.
కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి మాట్లాడుతూ.. "గొప్ప సినిమాలు నిబద్దతోనే వస్తాయి. అందుకు సినిమా బాగా వచ్చేలా నాకు తోడ్పడిన అభిషేక్‌గారికి, వారి నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వంశీని గత ఏడాది కలిశాను. ఆయన నా సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. నేను ఇప్పుడు రవితేజతో చేస్తున్న ఈ సినిమాపై కూడా అంతకంటే మరింత నమ్మకంతో వున్నాను. ఇండియన్ చరిత్రలో కశ్మీర్ ఫైల్స్ 300 కోట్ల క్రాస్ చేసింది. ఈ సందర్భంగా టైగర్ అభిషేక్‌ను అభినందిస్తున్నాను" అన్నారు.
![]() |
![]() |