![]() |
![]() |

మహానటుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మహానాయకుడిగా మారే క్రమంలో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అభిమానుల సమక్షంలో పార్టీ పేరును ఆయన అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగింది చరిత్ర. పార్టీ పెట్టిన మరుసటి ఏడాదే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అధికారాన్ని చేపట్టి, జనరంజకంగా పాలన చేశారు.
కాగా పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రకటన చేస్తున్నవి కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఫొటోలో తన తండ్రి దివంగత దీపక్ సింగ్ ఉండటం చూసి ఆనందపడిపోయింది నటి పూనమ్ కౌర్. ఆ ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసింది. అందులో ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా, ఆయన పక్కగా వెనుకవైపు తలకు టర్బన్ చుట్టుకొని కనిపిస్తున్నారు దీపక్ సింగ్.
ఆ ఫొటోను షేర్ చేసిన పూనమ్, "మా కుటుంబం మొత్తానికీ ఈ రోజు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. టీడీపీ రిలీజ్ చేసిన పిక్చర్స్‌లో ఎన్టీఆర్ గారి వెనుక ఇతర బలమైన సిక్కు మద్దతుదారులతో కలిసి మా నాన్న కనిపిస్తున్నారు. పాపా లవ్ యు, జోహార్ ఎన్టీఆర్ గారు" అంటూ రాసుకొచ్చింది.

పూనమ్ ఇటీవలే 'నాతిచరామి' అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. నాగు గవర డైరెక్ట్ చేయగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకు వీక్షకాదరణ లభించడంతో పాటు, శ్రీలత క్యారెక్టర్లో పూనమ్ ప్రదర్శించిన నటనకు ప్రశంసలు వస్తున్నాయి.
![]() |
![]() |