![]() |
![]() |

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రం బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు కనీవినీ ఎరుగని ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ఏరియాలో ఫస్ట్ డే ఆ సినిమా సాధించిన వసూళ్లు చూసి ఇండస్ట్రీతో విశ్లేషకులు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అవును. తెలంగాణ ఏరియాలో 'ఆర్ఆర్ఆర్' మూవీ ఏకంగా 23.35 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డును సాధించింది. టికెట్ ధరలు భారీగా పెరగడం, ఐదు ఆటలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణలోని దాదాపు అన్ని థియేటర్లలో ప్రదర్శించడంతో ఈ ఊహాతీత వసూళ్లు సాధ్యమయ్యాయి.
రామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించగా, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నాయిక పాత్రలను పోషించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆడియెన్స్ ఇష్టపడుతున్నట్లు రిపోర్టులు అందుతున్నాయి. తెలుగునాట ప్రేక్షకులు తొలిరోజు బ్రహ్మరథం పట్టగా, హిందీ బెల్ట్‌లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ డేకి సంబంధించి తెలంగాణలో 'భీమ్లా నాయక్' పేరిట ఉన్న రూ. 11.85 కోట్ల షేర్ రికార్డును 'ఆర్ఆర్ఆర్' దాదాపు రెట్టింపు మార్జిన్‌తో తుడిచిపెట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. తెలంగాణలో ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' నమోదు చేసిన ఫస్ట్ డే కలెక్షన్ 23.35 కోట్ల షేర్ రికార్డును ఇప్పట్లో మరో సినిమా దాటటం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ రూ. 70 కోట్లని అంచనా. అంటే మొదటిరోజే 33 శాతం రికవర్ అయ్యిందన్న మాట.
ఫస్ట్ డేకి సంబంధించి తెలంగాణలో ఇంతకుమునుపు మూడంటే మూడు సినిమాలు మాత్రమే రూ. 10 కోట్లకు పైగా షేర్ సాధించాయి. 'పుష్ప' మూవీ రూ. 11.44 కోట్లతో తొలిసారి ఈ ఫీట్‌ను సాధించగా, ఆ తర్వాత 'భీమ్లా నాయక్' రూ. 11.86 కోట్లు, 'రాధే శ్యామ్' రూ. 10.80 కోట్ల షేర్ సాధించాయి. తెలంగాణలో పది రోజుల వరకు టికెట్ రేట్లను పెంచుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించినప్పటికీ, సోమవారం నుంచి టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉందని వినిపిస్తోంది. మొత్తానికి ఈ వీకెండ్ 'ఆర్ఆర్ఆర్' బీభత్సమైన వసూళ్లను రాబట్టడం ఖాయం.
![]() |
![]() |