![]() |
![]() |

అల్లూరి సీతారామరాజు అంటే తెలుగువాళ్ల విప్లవ జ్యోతి. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య స్ఫూర్తి. అలాంటివాడి పాత్రను కల్పిత కథలోనైనా ఎలా చూపించాలి! జనం కోసమే పుట్టి, జనం కోసమే మరణాన్ని ఆనందంగా ఆహ్వానించిన ఆయన పాత్రను తెరపై ఎలా తీర్చిదిద్దాలి! కచ్చితంగా 'ఆర్ఆర్ఆర్' తరహాలో చూపించినట్లయితే కాదు.. అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
రామరాజును బ్రిటీష్ పోలీస్‌గా, బ్రిటీష్ దొరల అభిమానాన్ని పొంది, తద్వారా తన గేమ్ ప్లాన్‌ను అమలుచేసే వ్యక్తిగా చూపించడం చాలామందికి మింగుడు పడలేదు. అంతకంటే ముఖ్యంగా రామరాజు ఇంట్రడక్షన్ ఫైట్‌ను తీసిన తీరు వాళ్లను హతాశులను చేసింది. కలకత్తాలో లాలా లజపతిరాయ్‌ను అరెస్ట్ చేశారనే వార్త తెలిసిన జనం ఢిల్లీలో బ్రిటీష్ కోట దగ్గరకు వచ్చి నిరసనలు తెలియజేస్తారు. వారిని నిలువరించడానికి, కోట లోపలికి రాకుండా చేయడానికి ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తారు బ్రిటీషర్లు.
కానీ జనం ఉద్వేగానికీ, ఉద్రేకానికీ ఆ ముళ్లకంచె కూడా చాలదనిపిస్తుంది. ఆ జనంలో ఒకడు బ్రిటీషర్లను తూలనాడుతూ జనాన్ని ప్రేరేపిస్తుంటాడు. వేలాదిమంది జనం కంచెను పడెయ్యడానికి ప్రయత్నిస్తుంటే పోలీసుల భయంతో వణికిపోతుంటారు. అప్పుడు పోలీసుల్లో ఒకడిగా ఉన్న రామరాజు లాఠీ తీసుకొని, ఒక్కసారిగా కంచెపైనుంచి ఆ జనం మీదకు జంప్ చేసి, జనాన్ని ప్రేరేపిస్తున్నవాడ్ని పట్టుకోబోతే, జనం అతడ్ని నిలువరించడానికి ప్రయత్నిస్తారు. దాంతో కోపోద్రేకంతో ఊగిపోయిన రామరాజు విచక్షణారహితంగా ఆ పౌరుల పైకి లాఠీని ఝళిపిస్తాడు. ఇష్టమొచ్చినట్లు బాదేస్తాడు. ఎంతమంది అతడి లాఠీదెబ్బకు పడిపోతారో.. ఇంకెంతమంది అతడి ముష్టిఘాతాలకు గురవుతారో! తమవాడిని అతన్నుంచి కాపాడుకోవడానికి ఆ పౌరులు కూడా శతధా ప్రయత్నిస్తారు. రామరాజును రాళ్లతో కొడతారు. అతడిని చుట్టుముట్టి కలబడతారు. అయినా రామరాజు వాళ్లందర్నీ చావగొట్టి, వాళ్లు హాహాకారాలు చేస్తున్నా ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, తనకు కావాల్సిన వాడిని పట్టుకొని, బ్రిటీష్‌వాళ్లకు అప్పగిస్తాడు రామరాజు.
ఇదేం పాత్రచిత్రణ?! సీతారామరాజు కల్లోనైనా తను ప్రేమించే సామాన్య జనాన్ని ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా విచక్షణారహితంగా చితగ్గొడతాడా? వాళ్లపై కనికరం లేకుండా విరుచుకుపడతాడా? ఇది కచ్చితంగా రామరాజు వ్యక్తిత్యాన్ని కించపరిచే క్యారెక్టరైజేషన్ అని చెప్పకతప్పదు. ఎంత కల్పిత కథైనా సరే.. రామరాజును ఇలా చిత్రీకరించవచ్చునా? రామరాజు అభిమానులు కానీ, రామరాజు గురించి పరిశోధనలు చేసినవాళ్లు కానీ దీన్ని హర్షిస్తారా?
![]() |
![]() |