![]() |
![]() |

సౌత్ ఇండియన్ యాక్టర్స్ యూనియన్ (నడిగర్ సంగమ్) ఎన్నికలు 2019 జూన్‌లో జరిగాయి. వాటి కౌంటింగ్ నిన్న ఆదివారం చెన్నైలో నిర్వహించగా, నాజర్-విశాల్ ఆధ్వర్యంలోని 'పాండవర్ అని' ప్యానల్ మరోసారి అధికారంలోకి వచ్చింది. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా పోటీ చేసి, గెలుపొందగా, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పూచ్చి మురుగన్ విజయం సాధించారు.
2015లో అప్పటి 'నడిగర్ సంగమ్' అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధా రవి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ 2015లో 'పాండవర్ అని' ఏర్పాటైంది. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే యూనియన్‌కు కొత్త బిల్డింగ్‌ను నిర్మిస్తామని వాగ్దానం చేసి, ఎన్నికల్లో గెలిచాక నిర్మాణం ప్రారంభించింది.
అయితే 2018లో నడిగర్ సంగమ్ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపుకు నాయకత్వం వహించిన కె. భాగ్యరాజ్, ఇషారి గణేశ్ గతంలో 'పాండవర్ అని' ఎలాగైతే శరత్‌కుమార్-రాధా రవిలపై ఆరోపణలు చేసిందో, అదే తరహాలో విశాల్ గ్రూప్‌పై అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తీవ్రమైన గొడవలు జరగడంతో ఎన్నికల కౌంటింగ్, ఫలితాలను నిలిపివేశారు. అసోసియేషన్‌లోని సభ్యుల సంఖ్యకు మించి ఓటింగ్ జరిగిందనీ, దీని వెనుక విశాల్ గ్రూప్ ఉన్నదనీ అప్పట్లో కె. భాగ్యరాజ్ గ్రూప్ ఆరోపణలు చేసింది.
దాదాపు మూడేళ్లు గడిచాక, కౌంటింగ్ నిర్వహించవచ్చని న్యాయస్థానం ఉత్తర్వులివ్వడంతో ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో నాజర్, విశాల్, కార్తీ విజయం సాధించినట్లు స్పెషలాఫీసర్‌గా వ్యవహరించిన విశ్రాంత జడ్జి ప్రకటించారు. దీంతో విశాల్ బ్యాచ్ సంబరంలో మునిగిపోయింది.
![]() |
![]() |