![]() |
![]() |

మంచు ఫ్యామిలీ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మా ఎన్నికలు, టికెట్ ధరలు అంశాలతో పాటు 'సన్నాఫ్ ఇండియా' మూవీ టైంలో విపరీతమైన ట్రోల్స్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మంచు కుటుంబం ఓ వివాదంలో ఇరుక్కుంది. మంచు విష్ణు దగ్గర పదేళ్లకు పైగా హెయిర్ డ్రెస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను అనే వ్యక్తి.. తనని కులం పేరుతో దూషించడంతో పాటు తనపై దొంగతనం కేసు మోపారని ఆరోపించాడు.
మంచు విష్ణు దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను తమ కార్యాలయంలో రూ.5 లక్షలు విలువ చేసే సామాగ్రిని దొంగతనం చేసినట్లు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని మేనేజర్ అంటున్నాడు. అయితే నాగశ్రీను మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. తనకి, ఒకమ్మాయికి మధ్య ఇష్యూ జరిగిందని, దానితో వారికి ఏ సంబంధం లేకపోయినా మోహన్ బాబు గారు తనని పచ్చి బూతులు తిట్టారని తెలిపాడు. తనని కులం పేరుతో దూషించడంతో పాటు మోకాళ్ళపై కూర్చోబెట్టారని, అందుకే వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళట్లేదని చెప్పాడు. వాళ్ళ ఆఫీస్ నుంచి మాట్లాడటానికి రమ్మని ఫోన్ వచ్చిందని, కానీ వెళ్తే కొడతారన్న భయంతో తాను వెళ్లలేదని నాగశ్రీను చెప్పుకొచ్చాడు.
తాను పని మానేశానన్న కోపంతో తనపై తప్పుడు కేసు వేశారని నాగశ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద వాళ్ళతో తాను పోరాడలేనని, ఈ వార్తలు విని తన తల్లి ఆసుపత్రి పాలైందని అన్నాడు. మీరు చాలా పెద్దోళ్ళు, తన లాంటి పేదోడి జీవితంతో ఆడుకోవద్దని, తనని ఇలా వదిలేయండని నాగశ్రీను మంచు ఫ్యామిలీని రిక్వెస్ట్ చేశాడు.
![]() |
![]() |