![]() |
![]() |

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన స్వరూప్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. స్వరూప్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏప్రిల్ 1 న ఫూల్స్ డే. ఈ తేదీని నెగటివ్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమా ఈ తేదీకే విడుదలై ఘోర పరాజయాన్ని చూసింది. అయినప్పటికీ ఈ ఏడాది ఇదే తేదీకి 'ఆచార్య'తో చిరంజీవి, 'సర్కారు వారి పాట'తో మహేష్ బాబు రావాలని చూశారు. అయితే మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్' విడుదల ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 28 న ఆచార్య, మే 12 న సర్కారు వారి పాట విడుదల కానున్నాయి. ఇదిలాఉంటే ఇప్పుడు మెగాస్టార్, సూపర్ స్టార్ మిస్ అయిన విడుదల తేదీకి తాప్సీ రావడానికి సిద్ధమైంది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'మిషన్ ఇంపాజిబుల్'ని సంయుక్తంగా నిర్మించారు. శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. నెగటివ్ డేట్ కి విడుదలవుతున్న ఈ మూవీ తాప్సీకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |