![]() |
![]() |

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో తాన్య రవిచంద్రన్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతుంది. అలనాటి తమిళ్ హీరో రవిచంద్రన్ మనవరాలు అయిన తాన్య.. ఇప్పటికే తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు 'రాజా విక్రమార్క'తో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా తాన్య మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
*మీది సినీ నేపథ్యమున్న కుటుంబమే. మీ తాతగారు రవిచంద్రన్ సీనియర్ హీరో. మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు?
తాన్య: చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. 'ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు' అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. అయితే.. వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక.. పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ - హెచ్ఆర్) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.
*సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ రవిచంద్రన్ ఏమన్నారు?
తాన్య: దురదృష్టవశాత్తూ.. నేను సినిమాల్లోకి వస్తానని ఆయనకు తెలియకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాతయ్య చాలా హార్డ్ వర్కింగ్. ఆయనలో అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. వ్యక్తిగతంగా నేను ఆ మూడు లక్షణాలు నేర్చుకున్నాను. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని.
*'రాజా విక్రమార్క'లో అవకాశం ఎలా వచ్చింది?
తాన్య: దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్.
*సినిమాలో లేదా మీ పాత్రలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?
తాన్య: నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ.. కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి.
*కథ గురించి ఇంకేం చెబుతారు?
తాన్య: ఆల్రెడీ ట్రైలర్లు చూసి ఉంటారు కదా. కార్తికేయ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. అంతకు మించి చెప్పలేను. నవంబర్ 12న విడుదల అవుతుంది. థియేటర్లలో సినిమా చూడండి. చాలా బావుంటుంది. మా నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు.
*కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్...
తాన్య: హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.
*కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ. 'రాజా విక్రమార్క'లో మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది?
తాన్యా: నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ప్రామినెంట్ రోల్.
*తెలుగు మాట్లాడుతున్నారా?
తాన్య: ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ, వెంటనే తిరిగి మాట్లాడలేను.
*సినిమా షూటింగ్ చేసేటప్పుడు తెలుగు మాట్లాడటం ఇబ్బంది అయ్యిందా?
తాన్య: ముందు కొంత భయపడ్డాను. షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నేను హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు శ్రీ నాకు ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే, డైలాగులకు అర్థం వివరించడంతో పాటు తెలుగు డైలాగులకు ఇచ్చాడు. నా పాత్ర డైలాగులు మాత్రమే కాదు.. సన్నివేశంలో మిగతా ఆర్టిస్టుల డైలాగులు కూడా ఇచ్చారు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది.
*సినిమా చూశారా? మీకు చెప్పినట్టు తీశారా?
తాన్య: నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, షూటింగ్ చేశా కదా! నాకు దర్శకుడు శ్రీ ఏదైతే కథ, సన్నివేశాలు చెప్పాడో.. అదే తీశాడు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
![]() |
![]() |