![]() |
![]() |

బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్ విడుదలవడంతో షారుక్ ఖాన్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. మూడు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ అక్టోబర్ 30న బయటకు వచ్చాడు. బెయిల్ ఆర్డర్ ప్రకారం ప్రతి శుక్రవారం అతను ఎన్సీబీ ఆఫీసులో అటెండెన్స్ వేయించుకోవాలి. దాని ప్రకారం నవంబర్ 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు అతను హాజరు కావాల్సి ఉంది. ఈ రూల్ ప్రకారం, జైలు నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ టైమ్ ఎన్సీబీ ఆఫీసుకు హాజరయ్యాడు ఆర్యన్. అతను ఆ ఆఫీసులో ఎంటరవుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ పిక్చర్స్‌లో వైట్ టి-షర్ట్‌పై యెల్లో జాకెట్ ధరించిన ఆర్యన్‌ను మనం చూడొచ్చు. బ్లాక్ మాస్క్‌తో తన ఫేస్‌ను అతను కవర్ చేసుకున్నాడు. ఎన్సీబీ ఆఫీసుకు అతను వస్తాడని తెలుసు కాబట్టి, ముందుగానే కెమెరామన్లు, ఫొటోగ్రాఫర్లు ఆ ప్రదేశంలో గుమికూడారు. ఆర్యన్ వచ్చినప్పుడు వారంతా అతడిని చుట్టుముట్టారు. అయితే షారుక్ ఖాన్ బాడీగార్డ్ రవి అతనికి కవచంలా నిల్చున్నాడు.
క్రూయిజ్ షిప్‌లో అరెస్ట్ చేసినప్పుడు అతడి దగ్గర ఎన్సీబీకి ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ అతని వాట్సాప్ చాట్స్ ఒక విదేశీ డ్రగ్ కార్టెల్‌తో అతనికి అక్రమ డ్రగ్ డీల్స్ ఉన్నాయనే విషయాన్ని రుజువు చేస్తున్నాయని కోర్టులో ఎన్సీబీ వాదించింది. ఆ తర్వాత 14 కండిషన్లతో ఆర్యన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముంబైని విడిచి ఎక్కడకూ వెళ్లరాదనీ, ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరవ్వాలనీ, మీడియాతో మాట్లాడకూడదనీ, తనతో పాటు డ్రగ్ కేసులో ఉన్న అర్బాజ్ మర్చంట్ సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకూడదనీ బెయిల్ ఆర్డర్‌లో కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ కండిషన్లలో దేన్ని ఉల్లంఘించినా, ఆర్యన్ బెయిల్‌ను రద్దు చేయమని కోర్టును ఎన్సీబీ కోరవచ్చు.
![]() |
![]() |