![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన వారు మరుసటి రోజు నుంచి పునీత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య కూడా పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
శుక్రవారం బెంగళూరు వెళ్లిన సూర్య.. కంఠీరవ స్టూడియోస్ లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య.. పునీత్ కి నివాళులు అర్పిస్తూ కంటతడి పెట్టుకున్నారు. అంత్యక్రియలకు రాలేకపోయానంటూ సూర్య భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. పునీత్ చిత్రపటం దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్న సూర్య.. చాలాసేపు అలాగే ఉండిపోయారు. పునీత్ సమాధి దగ్గర సూర్య కంటతడి పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో సూర్య పక్కన పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ తో పాటు పలువురు ఉన్నారు.
పునీత్ తో టాలీవుడ్ స్టార్స్ కి కూడా మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ పునీత్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన రామ్ చరణ్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తాజాగా బెంగుళూరు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
![]() |
![]() |