![]() |
![]() |

సాంఘీకం, జానపదం, చారిత్రకం, పౌరాణికం.. ఇలా అన్ని జోనర్స్ లోనూ అఖండ విజయాలు అందుకున్న ఘనత నటరత్న నందమూరి తారక రామారావుది. అలాంటి ఎన్టీఆర్ నటజీవితంలో ప్రత్యేకంగా నిలిచే చిత్రంగా జానపద చిత్రరాజం `జగదేకవీరుని కథ`కి విశిష్ఠ స్థానం ఉంది. దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి రూపొందించిన ఈ అద్భుతం.. వెండితెరపై ఆవిష్కృతమై నేటికి సరిగ్గా అరవై వసంతాలు.
కథ విషయానికి వస్తే.. ఉదయగిరి రాజ్యానికి యువరాజైన ప్రతాప్ (ఎన్టీఆర్)కి నాలుగు లోకాలకి చెందిన దేవకన్యలని పెళ్ళాడాలనేది కల. ఈ కలని నెరవేర్చుకునే క్రమంలో ప్రతాప్.. జగదేక వీరుడిగా ఎలా అవతరించాడు? అనేదే ఈ సినిమా. ఇందులో దేవేంద్రుని కుమార్తె జయంతిగా బి. సరోజా దేవి, నాగేంద్రుని కూతురు నాగినిగా ఎల్. విజయలక్ష్మి, వరుణదేవుని పుత్రిక వరుణిగా జయంతి, అగ్నిదేవుని తనయ మరియచిగా బాల అభినయించారు. తమ అందచందాలతో అలరించారు.
రాజనాల, రేలంగి, సి.ఎస్.ఆర్, మిక్కిలినేని, కన్నాంబ, రుష్యేంద్రమణి, గిరిజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మించింది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``శివశంకరీ`` ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలవగా.. ``జలకాలాటలలో``, ``అయినదేదో అయినది``, ``మనోహరముగా`` పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగునాట ఘనవిజయం సాధించిన `జగదేకవీరుని కథ`.. తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలి, ఒరియా భాషల్లో అనువాదమై అన్ని చోట్ల ఆదరణ పొందింది. 1961 ఆగస్టు 9న విడుదలై జననీరాజనాలు అందుకున్న `జగదేకవీరుని కథ`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |