![]() |
![]() |

నిర్మాతగా `దిల్` రాజు స్థాయిని పెంచిన చిత్రాల్లో `బొమ్మరిల్లు`ది ప్రత్యేక స్థానం. అప్పటివరకు యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చిన రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. తొలిసారిగా రూపొందించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సిద్ధార్థ్, జెనీలియా, ప్రకాశ్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో భాస్కర్ దర్శకుడిగా తొలి అడుగేశాడు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులు, విమర్శకులు, పరిశ్రమ వర్గాల ప్రశంసలు పొందాడు.
అరవింద్, సిద్ధార్థ్ అనే తండ్రీకొడుకుల మధ్య సాగే కథే `బొమ్మరిల్లు` చిత్రం. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే తండ్రి అరవింద్ (ప్రకాశ్ రాజ్) కారణంగా జీవితంలో తనకంటూ ఓ ఛాయిస్ లేకుండా బతికేస్తుంటాడు సిద్ధార్థ్ (సిద్ధార్థ్). అయితే కెరీర్ విషయంలోనూ, పెళ్ళి చేసుకునే అమ్మాయి విషయంలోనూ తన ఇష్టప్రకారమే నడుచుకోవాలనుకుంటాడు సిద్ధూ. ఈ క్రమంలో సిద్ధార్థ్ కి ఎదురయ్యే అనుభవాలేంటి? హాసిని (జెనీలియా) పరిచయం సిద్ధు జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనేదే ఈ సినిమా. అన్ని వర్గాల వారిని అలరించే అంశాలతో రూపొందిన `బొమ్మరిల్లు`.. అఖండ విజయం సాధించడమే కాకుండా తమిళ, హిందీ, బెంగాలీ భాషలో రీమేక్ అయింది. అలాగే ఏడు నంది పురస్కారాలను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు - నేపథ్య సంగీతం, విజయ్ సి. చక్రవర్తి ఛాయాగ్రహణం, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్.. ఈ సినిమాకి అదనపు బలాలుగా నిలిచాయి. 2006 ఆగస్టు 9న విడుదలైన `బొమ్మరిల్లు`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |