![]() |
![]() |

మెగా కాంపౌండ్ కి ఆగస్టు 9తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ తేదిన మెగాస్టార్ చిరంజీవి రెండు విభిన్న చిత్రాలతో సందడి చేయగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమాతో పలకరించారు. ఈ మూడు సందర్భాల్లోనూ మామ, అల్లుళ్ళకి మంచి విజయాలే దక్కాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. 1984లో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన `ఛాలెంజ్` చిత్రం ఇదే ఆగస్టు 9న విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ పాపులర్ నవల `డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ. కోదండరామి రెడ్డి రూపొందించగా, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇదే ఆగస్టు 9న 1990లో చిరంజీవి నటించిన మరో చిత్రం విడుదలైంది. అదే.. `కొదమ సింహం`. కౌబాయ్ కథగా రూపొందిన ఈ సినిమాని కె. మురళీమోహనరావు డైరెక్ట్ చేయగా.. కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. రాజ్ - కోటి బాణీలతో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. దాదాపు 20 కేంద్రాల్లో `కొదమ సింహం` శతదినోత్సవం జరుపుకుంది.
మళ్ళీ కట్ చేస్తే.. సేమ్ ఆగస్టు 9న 22 ఏళ్ళ తరువాత మరో మెగా కాంపౌండ్ మూవీ వచ్చింది. ఆ సినిమానే.. `జులాయి`. బన్నీ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన ఈ యాక్షన్ కామెడీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. మైండ్ గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది.
మరి.. ముచ్చటగా మూడుసార్లు మెగాకాంపౌండ్ కి అచ్చొచ్చిన ఆగస్టు 9.. భవిష్యత్ లోనూ మరింతమంది మెగా క్యాంప్ హీరోలకు కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |