![]() |
![]() |

తెలుగునాట స్పోర్ట్స్ డ్రామాలకి ఊపునిచ్చిన చిత్రాల్లో `తమ్ముడు` ఒకటి. `తొలిప్రేమ` వంటి క్లాసిక్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాతో పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన హిందీ చిత్రం `జో జీతా వహీ సికందర్` (1992) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రీతి జింగానియా, అదితి గోవిత్రీకర్ తెలుగుతెరకు నాయికలుగా పరిచయమయ్యారు. పవన్ కి అన్నయ్యగా అచ్యుత్ నటించిన ఈ సినిమాలో రాజాకృష్ణమూర్తి, అలీ, బ్రహ్మానందం, చంద్రమోహన్, వెన్నిరాడై మూర్తి, మల్లికార్జునరావు, వేణుమాధవ్, ఐరెన్ లెగ్ శాస్త్రి, మాధవిశ్రీ (వర్ష) ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
రమణ గోగుల సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ``మేడిన్ ఆంధ్రా``, ``పెదవి దాటని``, ``వయ్యారి భామ``, ``ట్రావెలింగ్ సోల్జర్``, ``ఏదోలా ఉంది``, ``కలకలలు``.. ఇలా ఇందులోని గీతాలన్ని చార్ట్ బస్టర్స్ గా నిలవడం విశేషం. తమిళంలో `బద్రి` (విజయ్, భూమిక, మోనాల్), కన్నడంలో `యువరాజా` (శివరాజ్ కుమార్, లీసారే, భావనా పాణి), బెంగాలీలో `ఛాంపియన్` (జీత్, స్రబంతి ఛటర్జీ, సందిత ఛటర్జీ) పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన `తమ్ముడు`.. 1999 జూలై 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా 22 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |