![]() |
![]() |

కళాతపస్వి కె. విశ్వనాథ్ పేరు వినగానే సంగీత, నృత్య సంబంధింత చిత్రాలు కళ్ళముందు కదలాడతాయి. వాటిలో 1988లో విడుదలైన `స్వర్ణకమలం`కి ప్రత్యేక స్థానం ఉంది. విక్టరీ వెంకటేశ్, అభినేత్రి భానుప్రియ జంటగా విశ్వనాథ్ రూపొందించిన ఈ నృత్యప్రధాన సంగీతభరిత చిత్రం.. భానుప్రియకి `ఉత్తమ నటి`గా `నంది`, `ఫిల్మ్ ఫేర్` పురస్కారాలను అందించగా.. వెంకీకి `నంది` స్పెషల్ జ్యూరీ అవార్డుని అందించింది. అలాగే, `ఉత్తమ చిత్రం`గా ఇటు నందిని, అటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుందీ సినిమా. అంతేకాదు.. పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
షణ్ముఖ శ్రీనివాస్, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, మిశ్రో, ముచ్చర్ల అరుణ, శ్రీలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `స్వర్ణకమలం`కి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``ఆకాశంలో ఆశల హరివిల్లు``, ``కొత్తగా రెక్కలొచ్చెనా`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``ఘల్లు ఘల్లు``, ``శివపూజకు``, ``అందెలరవమిది`` కూడా అటు వీనులవిందుగానూ, ఇటు కనువిందుగానూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాటలన్నింటిలోనూ భానుప్రియ నృత్యాలు ఎస్సెట్ అనే చెప్పాలి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించిన `స్వర్ణకమలం`.. 1988 జూలై 15న జనం ముందు నిలిచింది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |