![]() |
![]() |

సినీ నటుడు, దర్శకుడు, క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ.. కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కత్తి మహేష్ మృతిపై ఆయన తండ్రి ఓబులేసు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కత్తి మహేష్ మరణించిన విషయం తమకు చెప్పలేదని.. తమ కంటే ముందే బయటకు చెప్పారని ఓబులేసు తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం వయోభారం రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కత్తి మహేష్ తండ్రి విజ్ఞప్తి చేశారు.
కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంద కృష్ణ అనుమానాలు వ్యక్తం చేశారు. కారులో కత్తి మహేష్ తో పాటు ప్రయాణించిన సురేష్ అనే వ్యక్తికి ఒక్క గాయం కూడా కాకపోవడం అనుమానాలకు దారి తీస్తోందన్నారు. కొద్ది రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అవుతారని ప్రకటించి.. అంతలోనే మరణించారని చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేష్ ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు.
ఇప్పటికే కత్తి మహేష్ మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే.. డ్రైవర్ సురేష్‌కు ఎందుకు చిన్న గాయం కాలేదని అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |