![]() |
![]() |
.jpg)
సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ (45) శనివారం చెన్నై అపోలో హాస్పిటల్లో కన్నుమూసిన విషయం విదితమే. అనంతరం ఆయన పార్థివదేహాన్ని బంధువులు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు యర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో జరగనున్నాయి. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరగడంతో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఆయన తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. ఆయన కోలుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన ఆకస్మికంగా మృతిచెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
సినీ విమర్శకుడిగా పేరు సంపాదించుకున్న కత్తి మహేశ్ రాజకీయ వ్యాఖ్యానాలతోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చే ట్రోల్స్ తక్కువేమీ కాదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాకే ఆయన అందరి దృష్టిలో పడ్డారు. ఆయన కోల్కతాకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త సోనాలికను వివాహమాడారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వారు కొంతకాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆమె భోపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. విడిపోయినప్పటికీ.. మహేష్, సోనాలిక స్నేహితులుగా కొనసాగుతున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |