![]() |
![]() |

భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ - ఇండియా మూవీస్ ట్రెండ్ కి ఊపునిచ్చిన చిత్రం `బాహుబలి - ది బిగినింగ్`. తెలుగు సినిమా దశ, దిశని మార్చివేసి.. టాలీవుడ్ కి మార్కెట్ పరంగా కొత్త దారిని చూపించిన `బాహుబలి` సిరీస్ లో తొలి భాగంగా రూపొందిన `బాహుబలి - ది బిగినింగ్`.. కేవలం తెలుగులోనే కాకుండా అన్య భారతీయ భాషల్లోనూ అఖండ విజయం సాధించింది. గత రికార్డులను భూస్థాపితం చేసి వసూళ్ళ పరంగా సరికొత్త చరిత్రని లిఖించింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ జానపద చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా.. భళ్ళాలదేవగా రానా ప్రతినాయకుడి వేషంలో ఆకట్టుకున్నారు. దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జాలదేవగా నాజర్ అత్యుత్తమ అభినయ ప్రతిభని ప్రదర్శించారు. అలాగే అడివి శేష్, సుదీప్, ప్రభాకర్, తనికెళ్ళ భరణి, రోహిణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ చిత్రంలో నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్, మధు స్నేహ ప్రత్యేక గీతంలో తమ చిందులతో కనువిందు చేశారు.
విజువల్ వండర్ గా నిలిచిన ఈ సంచలన చిత్రానికి స్వరవాణి కీరవాణి అందించిన బాణీలు, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణ విలువలు, వి. శ్రీనివాస మోహన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. `బెస్ట్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్` విభాగాల్లో `నేషనల్ అవార్డ్స్` అందుకున్న `బాహుబలి - ది బిగినింగ్`.. 13 `నంది` పురస్కారాలు, ఐదు `ఫిల్మ్ ఫేర్` అవార్డ్స్ తో పాటు మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. 10 జూలై 2015న విడుదలై పలు సంచలనాలకు చిరునామాగా నిలిచిన `బాహుబలి - ది బిగినింగ్`.. నేటితో ఆరు వసంతాలు పూర్తిచేసుకుంది. ఇక ఈ సిరీస్ లో రెండో చిత్రమైన `బాహుబలి - ది కంక్లూజన్` ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |