![]() |
![]() |
.jpg)
రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తిచేశాకే నటునిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆయన తొలిచిత్రం టి. కృష్ణ డైరెక్ట్ చేసిన 'వందేమాతరం' (1985). అంతకు ముందు ఆయన ఏవీఎం వారి 'పుదుమై పెణ్' సినిమాలో తొలిసారి తెరపై కనిపించారు. అందులో ఆయన విలన్‌గా నటించడం గమనార్హం. ఆ సినిమాకి భారతీరాజా దర్శకుడు. అంటే రాజశేఖర్‌ను నటునిగా పరిచయం చేసింది భారతీరాజా. రాజశేఖర్ తమిళంలో నటించిన రెండో సినిమా 'మన్సూర్' ఎడిటింగ్ దశలో ఉన్నప్పుడు టి. కృష్ణ చూశారు. అందులో ఆయన చేసిన ఫైట్ సీక్వెన్స్ కృష్ణకు నచ్చింది. అది చూసే 'వందేమాతరం'కు రాజశేఖర్‌ను తీసుకున్నారు.
చిన్నప్పట్నుంచీ రాజశేఖర్‌కు నత్తి. ఇప్పటికంటే చిన్నతనంలో ఆయనకు అది మరీ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ ఆయన నత్తి నత్తిగా మాట్లాడేవారు. అది చూసి టి. కృష్ణ స్నేహితుడైన నిర్మాత పోకూరి బాబూరావు, "ఇతను పనికిరాడండీ.. వేస్ట్" అని టి. కృష్ణతో అన్నారు. కానీ కృష్ణ ఏం ఫీలయ్యారో తెలీదు కానీ, "లేదు లేదు.. అతను స్క్రీన్ మీద బాగుంటాడు. నీకు తెలీదు, చూడు." అని బాబూరావుకు చెప్పారు.
అలా 'వందేమాతరం' సినిమాలో హీరోగా బుక్ అయ్యారు రాజశేఖర్. విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాలో రాజశేఖర్ నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమా కృష్ణచిత్ర బ్యానర్‌పై నిర్మాణమైంది. ఆ తర్వాత హీరోగా తను పనికిరాడన్న రాజశేఖర్‌తోటే ఈతరం ఫిలిమ్స్ బ్యానర్‌పై పోకూరి బాబూరావు ఐదారు సినిమాలు నిర్మించారు. వాటిలో 'రేపటి పౌరులు', 'ప్రజాస్వామ్యం', 'నవభారతం', 'అన్న' లాంటి సినిమాలున్నాయి.
![]() |
![]() |