![]() |
![]() |

`తల` అజిత్, త్రిష, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన `ఎన్నై అరిందాళ్` (తెలుగులో `ఎంతవాడుగానీ`)లో ఓ చిన్న పాత్రలో మెరిసిన అదితి బాలన్.. 2017లో విడుదలైన `అరువి`తో నటిగా మంచి గుర్తింపుని పొందింది. సోషియోపొలిటికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ తమిళ చిత్రంలో టైటిల్ రోల్ లో తన అభినయంతో అలరించడమే కాకుండా.. `ఫిల్మ్ ఫేర్`తో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తరువాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి `కుట్టిస్టోరీ` అనే ఆంథాలజీలో ఓ సెగ్మంట్ చేసిన అదితి.. సదరు షార్ట్ ఫిల్మ్ తోనూ ఇంప్రెస్ చేసింది.
కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ఓ మలయాళ చిత్రంతో పలకరించబోతోంది. ఆ సినిమానే.. `కోల్డ్ కేస్`. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది మిస్ బాలన్. ఓ మర్డర్ కేస్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ లో.. మరోమారు అభినయానికి అవకాశమున్న పాత్రలో అదితి కనిపించబోతున్నట్లు ప్రచార చిత్రాలని బట్టి స్పష్టమవుతోంది. కాగా, జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో `కోల్డ్ కేస్` స్ట్రీమ్ కానుంది. మరి.. ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అదితి ఏ మేరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |