Home  »  News  »  ఎందుకన్నయ్యా మాకు దూరమైపోయావు.. బాలుని తలచుకుంటూ చిరు భావోద్వేగం

Updated : Jun 4, 2021

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 
ఆ స్వరం మధురం. ఆ స్వరం అద్భుతం. 
ఆ స్వరంలో పసి పిల్లాడి నవ్వు వినిపిస్తుంది. యువకుడి ప్రేమ కనిపిస్తుంది. మొత్తం జీవితమే శ్రావ్యంగా పలకరిస్తుంది.
నవరసాలను తన పాటలో పలికించగల గాయకుడు ఎస్పీ బాలు.
పాట బ్రతికున్నంత కాలం ఆయన బ్రతికుంటారు.
అందుకే ఆయనకు మరణం లేదు.

ఎస్పీ బాలు 75 వ జయంతి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఆయన జయంతి వేడుకులను వర్చువల్ విధానంలో జరుపుతోంది. ఈ సందర్భంగా సినీప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ వేడుకులలో హోస్ట్ బాధ్యత తీసుకున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్.. మొదట బాలు గురించి ఆయన సాధించిన ఘనత గురించి మాట్లాడి.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడవల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా చిరు.. అన్నయ్య అంటూ బాలుతో ఉన్న అనుభందం గురించి ఆయన చెప్పిన మాటలు మనస్సుని హత్తుకున్నాయి.

బాలుని అన్నయ్య అని పిలవడం అలవాటు అని చెప్పిన చిరు.. ఒకసారి అన్నయ్య అని పిలకుండా అండీ అని పిలిచినందుకు బాలు తన మీద చిరుకోపం చూపించారని చిరు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు బాలుని అన్నయ్య అని పిలిచే చిరు.. చాలా విరామం తరువాత ఒకసారి బాలు కలిస్తే.. ఏవండీ బాలు గారు అని పలకరించారట. ఆ పిలుపుకి బాలు 'ఏంటయ్యా ఆ పిలుపు.. ఎప్పుడూ అన్నయ్య అంటూ ఎంత ఆప్యాయంగా పిలుస్తావు.. ఇలా అండీ అంటూ నన్ను దూరం చేయొద్దు' అన్నారట. ఆ మాటలను గుర్తు చేసుకున్న చిరు.. 'దూరం చేయొద్దు అంటూనే మమల్ని విడిచి దూరంగా వెళ్ళావా అన్నయ్య' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తన సినిమాలలో బాలు ఎన్నో పాటలు పాడారని, తన సక్సెస్ లో సగ భాగం ఆయనకు వెళ్తుందని చిరు అన్నారు. అలాగే అన్నయ్యకి, తనకి ఓ విషయంపై గొడవ అయ్యేదని చిరు చెప్పారు. ఇంత టాలెంట్ ఉన్న నువ్వు ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే ఎందుకు చేస్తున్నావ్ అని బాలు అడిగేవారట. అయితే చిరు తాను ఆరాధన, శుభలేఖ, స్వయం కృషి, రుద్రవీణ ఇలా ఎన్నో సినిమాలు చేసానని.. కానీ ప్రేక్షకులు తన నుండి కమర్షియల్ సినిమాలు కోరుకోవడం, అలాంటి సినిమాలతో ప్రొడ్యూసర్స్ కి వచ్చే నష్టాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి సినిమాలు ఎక్కువగా చేయలేకపోతున్నానని చిరు చెప్పేవారట. ఇలా బాలుతో ఉన్న అనుబంధాన్ని చిరు గుర్తుచేసుకున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.